మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఉదంతంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అనంతబాబుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ…ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
సుబ్రహ్మణ్యం పోస్టు మార్టం రిపోర్ట్ తర్వాత అనంతబాబుపై హత్య కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. కాకినాడ మేజిస్ట్రేట్ ఎదుట ఎమ్మెల్సీ అనంతబాబును హాజరుపరిచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారని కూడా ప్రచారం జరగుతోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించడం లేదదు. అరెస్ట్ నిజమైతే ఎందుకు దానిని వెల్లడించడం లేదని పోలీసులను సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు నిలదీస్తున్నారు.
అయితే, అనంతబాబును అదుపులోకి తీసుకున్న తర్వాత కాకినాడ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు రహస్యంగా తరలించారని తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి అరెస్టు చేసిన వివరాలు వెల్లడించబోతున్నారని తెలుస్తోంది. కాకినాడలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద భారీ సంఖ్యంలో పోలీసులను మోహరించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబు సన్నిహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారట.
మృతుడు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల ఫిర్యాదుతో అనుమానస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు, పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం హత్య కేసుగా మార్చారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌పై సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ కేసు కూడా నమోదైందని తెలుస్తోంది.