2019 ఎన్నికల్లో సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు స్థాయిలో అనూహ్యంగా 151 స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించింది. ఆ గెలుపిచ్చిన ధీమా కావొచ్చు..లేదంటే స్వతహాగానే సీఎం జగన్ ధోరణి కావొచ్చు…పార్టీలో నా మాటే శాసనం అనే రేంజ్ లో జగన్ అధికారం చలాయిస్తూ వచ్చారు. కట్ చేస్తే….తాజాగా ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయిందన్న టాక్ వస్తోంది.
ఓ పక్క జగన్ తన పాలనా రాహిత్యంతో ప్రతిపక్షాలకు అస్త్రాలు అందిస్తుండగా…మరో పక్క అసంతృప్త ఎమ్మెల్యేలు జగన్ కు పక్కలో బల్లెంలాగా మారారని టాక్ వస్తోంది. విపక్షాలు జగన్ పాలనను ఏకిపారేస్తుండడంతో వైసీపీ అధినేత బింకం తగ్గుతోందన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేల్లో ధిక్కార స్వరం కూడా పెరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మంత్రి పదవి పోయినందుకు బాలినేని, సుచరిత, కేబినెట్లో చోటు దక్కలేదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభాను అలక పాన్పు ఎక్కడంతో జగన్ తల పట్టుకుంటున్నారట. ఇక, క్యాంపు కార్యాలయం సమీపానే గొల్ల బాబూరావు నిరసనలు తెలపడం, నెల్లూరులో అనిల్ వర్సెస్ కాకాణి సభలు అడ్డుకోలేక నాయకత్వం సతమతమవుతోందన్న టాక్ వస్తోంది.
మరోపక్క వివేకా మర్డర్ కేసు వ్యవహారం ముదిరి పాకానపడడం, ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ కాచుకుని కూర్చుండడంతో జగన్ నలువైపుల నుంచి సతమతమవుతున్నారట. మొన్న మొన్నటి దాకా తన మాటే వేదమని, అందరూ వినాల్సిందేనన్న వైఖరిలో ఉన్న జగన్…ఇపుడు కాస్త వాస్తవిక ప్రపంచలోకి వస్తున్నారట. అసంతృప్త ఎమ్మెల్యేల ధిక్కార స్వరాన్ని జగన్ అడ్డుకోలేకపోతున్నారన్న టాక్ పార్టీలో వినిపిస్తోంది.
మంత్రి వర్గ విస్తరణ తర్వాత తన నాయకత్వంపై సొంత పార్టీలో సైతం ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో జగన్కు అర్థమైందని తెలుస్తోంది. అందుకే, ఈ ధిక్కార ధోరణిని చూసీచూడనట్లు వదిలేస్తున్నారని, దీంతో, ఎమ్మెల్యేలపై జగన్ పట్టుసడలిందని అనుకుంటున్నారు. వలంటీర్ల పాటి చేయమా? అన్న రీతిలో ఎమ్మెల్యేలలో అసంతృప్తి పెరిగిందట. ఆ వ్యవస్థతో ఎమ్మెల్యేకూ, ప్రజలకూ మధ్య ఉన్న బంధం తెగిపోయిందని ఆనం రాం నారాయణ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.