నెల్లూరు జిల్లా వైసీపీ నేత, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. అధికార పార్టీపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ప్రసన్న కుమార్ రెడ్డికి ఉంది. జగనన్న ఇళ్లలోని బెడ్ రూమ్స్…కొత్త జంటల శోభనానికి చాలా చిన్నవిగా ఉన్నాయని, వారు హాల్లో శోభనం చేసుకోవాల్సిందేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీని ఇరుకున పడేశాయి.
ఈ క్రమంలోనే తాజాగా ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సర్పంచులు గెలిచిన మండలాల్లో వారు చెప్పిన పనులు చేయొద్దంటూ బహిరంగంగానే ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి హుకుం జారీ చేయడం కలకలం రేపింది. టీడీపీ సర్పంచ్ లతో పాటు మరే వైసీపీ నాయకులు చెప్పిన పనులు చేయడానికి వీల్లేదని, స్థానిక వైసీపీ నేత కుమార్ రెడ్డి చెప్పిందే చేయాలని ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది.
దేవిస్‌పేట, కొత్తూరు, పున్నూరు, పల్లెపాడు గ్రామాల్లో టీడీపీ సర్పంచి అభ్యర్థుల్ని గెలిపించడంపై ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్ అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే… వైసీపీ అభ్యర్థులను ఓడించి టీడీపీ అభ్యర్ధులని ఎలా గెలిపిస్తారని ప్రజలనుద్దేశించి ఆయన ప్రశ్నించారు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు విన్న అధికారులు, సిబ్బంది షాకయ్యారు. ప్రతిపక్ష నేతల సంగతి పక్కనబెడితే…సొంతపార్టీకి చెందిన కొందరు నేతలు చెప్పినా పనులు చేయొద్దని హుకుం జారీ చేయడంపై వారు అవాక్కయ్యారట.