తమది రైతుల సంక్షేమాన్ని పట్టించుకునే ప్రభుత్వం అని, రైతుల కోసం తాము ఎన్నో పథకాలు రూపొందించామని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. అందుకే, రైతులను గౌరవిస్తూ ప్రతి ఏటా జులై 8న రైతు దినోత్సవం జరుపుకుంటున్నామని చెబుతుంటారు. అయితే, ఈ ఏడాది గుంటూరు జిల్లాలో జరిగిన రైతు దినోత్సవం నాడు మార్కెట్ యార్డు సాక్షిగా రైతులను అవమానించారు.
వ్యవసాయ సంక్షోభంలో రైతాంగం కూరుకుపోయి నానా కష్టాలు పడుతుంటే వైసీపీ నేత ఒకరు మార్కెట్ యార్డులో రైతు దినోత్సవం నాడు రికార్డింగ్ డ్యాన్సులతో హోరెత్తించారు. గుంటూరు జిల్లాలోని క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో స్థానిక వైసీపీ నాయకుడు షేక్ గని రైతు దినోత్సవం నాడు తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. అయితే, ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో రికార్డింగ్ డాన్సు ప్రోగ్రామ్ పెట్టారు.
నిబంధనలకు తిలోదకాలిచ్చిన వైసీపీ నేతలు…డ్యాన్సర్లతో కలిసి చిందేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో వైసీపీ నేతలు గానా బజానా ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. మార్కెట్ యార్డులో వైసీపీ నేతలతోపాటు స్థానిక గ్రామ సచివాలయ సిబ్బంది కూడా విందు, వినోదాలు, రికార్డింగ్ డ్సాన్సులతో చిందులేస్తున్నప్పటికీ పోలీసులు, అధికారులు చోద్యం చూస్తూ ఉండడంపై విమర్శలు వస్తున్నాయి.