ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ని ప్రజలు పాతాళానికి తొక్కి ఏకపక్షంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. గతి ఎన్నికల్లో 175 స్థానాలకు 151 స్థానాలు గెలుచుకున్న వైసీపీ.. ఈసారి కేవలం 11 సీట్లతో సరిపెట్టుకుంది. కనీ వినీ ఎరుగని పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే పదవులు పోయినా కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలకు డాబు మాత్రం పోలేదు.
ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వెలువడ్డాయి.. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది. కానీ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా తమ అధికారంలోనే ఉన్నట్టు భ్రమ పడుతున్నారు. పదవి పోయినా గతంలో ప్రభుత్వం కేటాయించిన స్టిక్కర్ మాత్రం వారి వాహనాల నుంచి ఊడటం లేదు.
కడప జిల్లా కోడూరు నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సోమవారం రైల్వేకోడూరు టోల్గేట్ సెంటర్లో దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా పూలమాలలు వేయడానికి వెళ్లారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి కోడూరులో పోటీ చేసి జనసేన అభ్యర్థి చేతుల్లో ఓడిపోయినా కూడా కొరముట్ల శ్రీనివాసులు మాత్రం తన ఓల్వో కారుకు ముందు వెనుక ప్రభుత్వ విప్ స్టిక్కర్ మాత్రం తీయలేదు. ప్రభుత్వ విప్ స్టిక్కర్ తోనే ఆయన తిరిగేస్తున్నారు.
అలాగే దక్షిణ విశాఖపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిలు మే 13వ తేదీతో మాజీలైపోయారు. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి.. తమ కార్లపై ఎమ్మెల్యే స్టిక్కర్లను తొలగించకుండా తిరిగేస్తున్నారు. వీళ్లతో పాటు చాలా మంది వైసీపీ నేతలు తమ కార్లకు ఎమ్మెల్యే స్టిక్కర్లు తీయకుండానే వెళ్తున్నారు. దీంతో వారి తీరు పట్ల విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. పదవి పోయినా వైసీపీ నేతలకు డాబు పోలేదంటూ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.