టీడీపీ యువనాయకుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై రాళ్ల దాడి జరిగింది. వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు.. ఈ దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిలో హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్‌ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలవైపు దూసుకొచ్చిన వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు.
ఈ ఘటనలో అక్కడే ఉన్న ఎస్ఐ తలకు గాయమైంది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాజా రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండి పడ్డారు. బాధితుల పరామర్శకు వెళ్లిన వారిపై వైసీపీ కుక్కలు రాళ్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కుక్కల దాడులకు టీడీపీ నేతలు బయపడే ప్రసక్తే లేదన్నారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. రూ. 5 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. హత్యాచారానికి గురై మృతిచెందిన తిరుపతమ్మ మృతదేహానికి లోకేశ్ నివాళులర్పించారు. దీనికి ముందు.. తెనాలి ప్రభుత్వాస్పత్రి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకంది. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ వచ్చారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు.
ఓవైపు తిరుపతమ్మ మృతదేహం, మరోవైపు రూపశ్రీ(ప్రియుడు పొడిచి చంపిన కేసు) మృతదేహాలను స్వ గ్రామాలకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో టీడీపీ శ్రేణులు అంబులెన్స్ ను అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బాధితురాలి మృత దేహాన్ని పోలీసులు బలవంతంగా తరలించారు. పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.
ఏం జరిగిందంటే..
గుంటూరు జిల్లా తెనాలి మండలం దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో.. ఓ మహిళపై హత్యాచారం జరిగింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. మృతురాలి ఒంటిపై ఉన్న గాయాలను చూసిన పోలీసులు.. అత్యాచారం జరిగిందని నిర్థరణకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో నిందితులకు తెనాలి ఐతానగర్‌కు చెందిన కొంతమంది నాయకుల మద్దతు ఉందని.. మృతురాలి భర్త ఆరోపించారు. ఘటనపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని.. జిల్లా ఎస్పీని ఆదేశించారు. తర్వాత లోకేష్ పరామర్శకు వెళ్లగా.. రాళ్ల దాడి జరిగింది.