మహిళ అనుకుంటే.. కానిది లేదు! ఇదేదో.. ఊసుపోక చెప్పే మాట కాదు.. ఉత్తి మాట అంతకన్నాకాదు. ఇంటికే కాదు.. ఈ సమాజానికి కూడా దీపం ఇల్లాలే! అన్న సీ నారాయణరెడ్డి మాట.. అడుగడుగునా నిజం అవుతోంది. మహిళా శక్తి.. ఇంతింతై అన్నట్టుగా అనేక రంగాల్లో విస్తరించింది. సమాజ హితం కోసం.. ఈ దేశం కోసం.. నారీ మణులు చేస్తున్న కృషి.. ఎంత చెప్పుకొ న్నా.. తక్కువే! మరీ ముఖ్యంగా.. విభజిత ఆంధ్రప్రదేశ్.. రాజధాని అమరావతి కోసం.. మహిళా లోకం.. శ్రమిస్తున్నతీరు.. ఉద్యమాన్ని నడిపిస్తున్న తీరు గమనిస్తే.. నభూతో.. అని అనిపించకమానదు. ఒకరోజు కాదు.. ఒక వారం కాదు.. ఒక నెల అంతకన్నాకాదు.. ఏకంగా ఏడాది.
అమరావతి ఉద్యమానికి ఏడాది కాలం గిర్రున తిరిగిపోయింది. ఈ ఏడాది కాలంలో రాజధానిగా అమరావతే ఉండాలనే ఉక్కు సంకల్పంతో ముందుకు సాగింది మహిళా లోకం. నాడు.. 2015లో చంద్రబాబు ప్రబుత్వం రాజధాని అమరావతికి శ్రీకారం చుట్టినప్పుడు.. ముందుండి ప్రబుత్వానికి సహకరించింది మహిళా లోకమే! మహిళా రైతులతోపాటు.. వివిధ రంగాల్లోని మహిళలు సైతం.. రాజధాని లేకుండా ఏర్పాటైన నవ్యాంధ్రకు సరికొత్త రాజధానిని ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబు హామీతో ముందుకు కదిలారు. జీవనాధారమైన తమ పొలాలను.. రాజధానికి ఇచ్చేందుకు ముంందుకు వచ్చారు. ఆంధ్రుల రాజధాని ప్రపంచ నగరంగా వర్ధిల్లుతుందని బావించి నాడు శంకుస్థాపన సమయంలో హారతులు పట్టారు.
నిస్వర్థంగా చేసిన ఈ త్యాగం వెనుక.. మహిళలు ఆశించింది కేవలం రాష్ట్ర ప్రయోజనమేననడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి చేతికి ఉన్న చిన్న ఉంగరాన్ని సైతం వదులుకునేందుకు ఏ మహిళా ఇష్టపడదు. అలాంటిది మూడు పూటలా తమకు అన్నం పెడుతున్న భూములను సైతం వారు రాష్ట్రం కోసం.. వదులుకున్నారంటే.. ఒకరంగా దీనిని త్యాగం అన్నా కూడా చిన్నదే అవుతుంది. అలాంటి మహిళల ఆశలకు గండికొడుతూ.. జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదికి తెచ్చింది. అమరావతిపై జగన్ సర్కారు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. వద్దు సార్! మేమెన్నో ఆశలతో ఆరుగాలం పండే మా భూములను రాష్ట్ర ప్రయోజనం కోసం.. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం .. త్యాగం చేశాం.. మీ రాజకీయాలను మాపై ప్రయోగించవద్దని వేడుకున్నారు.
గవర్నర్ను సైతం కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. అయినప్పటికీ.. ప్రభుత్వం వారి మాట వినలేదు. పైగా అధికార పార్టీ నేతలు మహిళలని కూడా చూడకుండా.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో కడుపు రగిలిన నారీ లోకం.. తమ శక్తి ఏంటో చూపిస్తామం టూ.. రోడ్డెక్కింది. పురుషులతో సమానంగా.. కొన్ని కొన్ని సార్లు వారికన్నా.. దూకుడుగా ఉద్యమాన్ని కొనసాగించారు. మహిళా జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు. 29 గ్రామాల మహిళలే కాకుండా.. పలు జిల్లాల్లోని మహిళలను కూడా కూడగట్టుకున్నారు. మహిళా కమిషన్కు తమ మొర వినిపించారు. అదేసమయంలో పోలీసుల దాష్టీకాన్ని ఎదిరించారు. “మేం మా కోసం ఏమీ అడగడం లేదు. ఈ రాష్ట్రం కోసం కోరుతున్నాం.!! “అంటూ రాజధాని నినాదాన్ని ఇంటింటికీ వినిపించేలా గర్జించారు.
గతంలో గుంటూరుకు పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలో మూడు దశాబ్దాల కిందట సారా ఉద్యమం తెరమీదిక వచ్చినప్పుడు.. ఇలానే మహిళా శక్తి ఏకమైంది. అప్పట్లో దూబగుంట రోశమ్మ నేతృత్వంలో ఉవ్వెత్తున ఎగిసిన సంపూర్ణ మద్యపాన వ్యతిరేక మహోద్యమం రాష్ట్రాన్ని కదిలించింది. అప్పటి ప్రబుత్వం సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించే వరకు ఆమె మహిళలను ఏకం చేశారు. సారాకు వ్యతిరేకంగా పోరు చేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో అమరావతి ఉద్యమంలో మహిళలు కీలక పాత్రపోషించారు. పోషిస్తున్నారు. వీరిలో అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కరిదీ ఒకే నినాదం.. ఏపీఏకైక రాజధానిగా అమరావతే ఉండాలి.. అనే!! పాదయాత్రలు చేశారు. రోడ్లపైనే వంటా వార్పూ చేశారు. అందరి దేవుళ్లకు మొక్కారు. పొంగళ్లతో మొక్కులు మొక్కారు.
అమరావతి శిబిరాల్లోనే పగలనక రేయనక.. పోరు సల్పారు. ఉద్యమానికి ఆర్థిక సహకారంగా.. తమకు పసుపు కుంకుమ కింద దక్కిన బంగారన్ని సైతం ఇచ్చేశారు. అసలు తిన్నారో.. తినలేదో.. నిద్రపోయారో.. లేదో.. కూడా తెలియనంతగా అలుపెరుగని పోరులో అతివలు.. అగ్రస్థానంలో నిలిచారు. నిజానికి తొలుత వీరిని తక్కువగా అంచనా వేసిన అధికార పార్టీ నేతలు.. తర్వాత తర్వాత.. వీరి శక్తిని గమనించి.. మౌనం పాటించడం ప్రారంభించారు. ఇక, ఈ ఉద్యమానికి ఏడాది పూర్తయింది. ఇప్పుడు కూడా మహిళల్లో.. ఉద్యమ వేడి ఎక్కడా చల్లారలేదు. మరింతగా భోగిమంటై.. రగులుతున్నదే తప్ప! ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
కొసమెరుపు: ఉద్యమించిన మహిళలు ఓడిపోయిన చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు. అది వ్యక్తిగతం కావొచ్చు.. సామాజిక ప్రయోజనం కావొచ్చు. మహిళలదే అంతిమ విజయం.. దేశంలో తీవ్ర చర్చనీయాంశమైన నర్మదా బచావో.. ఆందోళన చేసింది మహిళలు, ట్రిపుల్ తలాక్ ఉద్యమాన్ని ముందుండి నడిపింది అతివలే, అనేక ఆలయాల్లో మహిళలకు ప్రవేశం కల్పించేలా చట్టాలు మార్చేందుకు ఉద్యమించి కూడా మహిళా శక్తే. పురుషులతో సమాన హక్కుల కోసం ఉద్యమించి విజయం సాధించిది కూడా పడతులే. సారా వ్యతిరేక ఉద్యమం నుంచి.. మూడు రాజధానుల వ్యతిరేక ఉద్యమం వరకు వారు తలుచుకుంటే.. సాధించలేనిది ఏమీ లేదు. ఇప్పుడు ఇది కూడా సాకారం కావడం ఖాయం!!