మనిషికి పరిశుభ్రత ఎంతో ముఖ్యం. అందులోనూ కరోనా కాలంలో తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడం, బయటకు వెళ్లి వచ్చిన వెంటనే స్నానం చేయడం వంటి అలవాట్లు మరింత ముఖ్యం. అయితే, స్నానం అనగానే ఎవరైనా 5 నిమిషాలు…లేదంటే 10 నిమిషాలు…ఇంకా ఓసీడీ ఉన్న అతి శుభ్రత బ్యాచ్ అయితే అరగంట…సమయం తీసుకుంటారు. కానీ, స్నానం చెయ్యమన్నారు కదా అని ఒకటి కాదు రెండు కాదు 16 గంటల పాటు స్నానం చేసిందో మహిళ. ఈ అతి శుభ్ర అద్భుత స్నానం పుణ్యమా అంటూ సదరు మహిళకు చర్మ వ్యాధి సోకడంతో ఇపుడు పరిష్కారం చెప్పాలంటూ లబోదిమోమంటున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
టిక్‌టాక్ యూజర్ అయిన ఓ మహిళ అనుకోకుండా 16 గంటల పాటు స్నానం చేసిందట. ఫలితంగా ఆమె కాళ్లు, చేతుల మీద చర్మం ముడుచుకుపోయింది. అరికాళ్లు మొత్తం రక్తం పీల్చేసినట్లుగా పాలిపోయాయి. దీంతో, కంగారుపడ్డ ఆ మహిళ…తన కాళ్లు, చేతులను మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావాలంటే ఏం చేయాలంటూ తన కాళ్లు, చేతుల ఫొటోలు పోస్ట్ చేసి నెటిజన్లు హెల్ప్ కోరింది.
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు.16 గంటల పాటు స్నానం ఎలా చేశావంటూ ఆరా తీస్తున్నారు. అన్ని గంటలు బాత్రూంలో ఏం చేశావు..కొంపతీసి షవర్ ఆన్ చేసి నిద్రపోయావా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు తమకు తోచిన సలహాలిచ్చి చిట్కాలు చెబుతుండగా…ఇంకొందరు ఆమెను త్వరగా హాస్పిటల్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. మొత్తానికి మహానుభావుడులో శర్వానంద్ టైపులో ఈ “మహానుభావురాలు” సోషల్ మీడియాలో వైరల్ అయింది.