సీఎం జగన్ కార్యాలయం వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. సీఎం అపాయింట్ మెంట్ లభించకపోవడంతో మనస్తాపం చెందిన కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్ర అనే మహిళ మణికట్టు కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించడం కలకలం రేపింది. ఆమె కుమార్తె సాయిలక్ష్మీ చంద్ర వెన్నెముక సమస్యతో బాధపడుతోందని, ఆమె చికిత్సకు రూ.2 కోట్లు కావాలని వైద్యులు చెప్పడం సీఎం సాయం కోరేందుకు అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. స్పందన కార్యక్రమంలో ఆమె అధికారులను కలిసి తన బాధను చెప్పుకున్నారు.
కుమార్తె చికిత్స కోసం అన్నవరంలోని తమ ఇంటిని అమ్ముకోవాలని ప్రయత్నించామని, కానీ, మంత్రి దాడిశెట్టి రాజా గన్ మన్, మరో కానిస్టేబుల్ తో కలిసి అమ్మనివ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ ను కలిసే అవకాశం ఇప్పించాలని అధికారులను ఆమె ప్రాధేయపడ్డారు. ఇంత చెప్పినా సరే జగన్ అపాయింట్ దొరకలేదు. దీంతో ఆమె తమకు న్యాయం జరగదని భావించి ఓ బ్లేడుతో మణికట్టు వద్ద కోసుకున్నారు. ఆమె కింద పడిపోగా, వీల్ చెయిర్ లో ఉన్న ఆమె కుమార్తె పరిస్థితి దయనీయంగా మారింది. పక్కనున్నవారు ఆ మహిళకు ప్రథమ చికిత్స చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఆ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరం అని చంద్రబాబు అన్నారు..తన ఇంటిని అమ్ముకునే స్వేచ్ఛ కూడా ఆమెకు లేకుండా చేయడం దారుణమని, దీనికి కారణం అయిన మంత్రి గన్ మెన్ తదితరులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీలో అధికార మదంతో సామాన్య ప్రజలపై జరుగుతున్న వేధింపులకు ముగింపు ఎప్పుడు? అని మండిపడ్డారు. గతంలో కాకినాడ కలెక్టరేట్ ముందు ఆరుద్ర ధర్నా చేసినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇంతవరకు వచ్చేదా? అని ప్రశ్నించారు.
తాడేపల్లి ప్యాలెస్ లో అభినవ నీరో జగన్ రెడ్డికి కాకినాడలో వైసీపీ నేతల అరాచకాలు కనపడవు అని లోకేశ్ విమర్శించారు. ఆరుద్ర అనే మహిళ ఆర్తనాదాలు వినపడవు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిడ్డ వైద్యానికి తక్షణమే సాయం అందించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఆత్మహత్యాయత్నం చేసిన ఆరుద్ర ప్రాణాలు కాపాడాలని స్పష్టం చేశారు. మంత్రి పేరుతో కబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతున్న కానిస్టేబుళ్లని అరెస్టు చేయాలని పేర్కొన్నారు.