ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామను గత ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్ కు గురిచేసిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తనను కస్టడీలో పోలీసులు, సీఐడీ అధికారులు హింసించారని…అరికాళ్లపై కొట్టారని, గుండెలపై కూర్చున్నారని రఘురామ స్వయంగా ఆరోపించిన వైనం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారంపై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనను హింసించిన వాళ్లంతా జైలుకు వెళ్లాల్సిందేనని, అది తన పంతం అని రఘురామ షాకింగ్ కామెంట్లు చేశారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వారిని జైలుకు పంపేవరకు మనశ్శాంతి లేదన్నారు రఘురామ. తనపై కస్టోడియల్ టార్చర్ కేసును ఈ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని చెప్పారు. విజయ పాల్ ఎన్నో ధందాలు చేశారని, ఆయన దుర్మార్గుడని విమర్శించారు. తనను కస్టోడియల్ టార్చర్ చేసింది విజయ్‌పాల్ అని, కానీ, ఆయన వెనుక సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ఉన్నారని రఘురామ ఆరోపించారు.
అరెస్టు భయంతో సునీల్ కుమార్ విదేశాలకు పారిపోయే అవకాశముందని, ఈ కేసులో కూటమి ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించి సునీల్ కుమార్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.