సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ కు, వైసీపీ నేతలకు పక్కలో బల్లెంలా మారిన ఆర్ఆర్ఆర్ వీలు చిక్కినప్పుడల్లా పదునైన కామెంట్లు, సెటైర్లతో జగన్ పాలనను, పార్టీని ఏకి పడేస్తున్న వైనం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్సార్సీపీ అధ్యక్ష పదవికి జగన్ పై తాను పోటీ చేస్తానని ఆర్ఆర్ఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు.. 2017లో థూథూ మంత్రంగా పార్టీ అధ్యక్స ఎన్నికలు నిర్వహించి చేతులు దులుపుకున్నారని, తాజాగా కేసీఆర్ నిర్వహించినట్లుగా ఎన్నికలు నిర్వహిస్తే జగన్ పై పోటీకి తాను సిద్ధమని ప్రకటించారు. జగన్ ప్రజావ్యతిరేక విధానాల వల్ల పార్టీ ప్రజాదరణ కోల్పోతోందని తాను నిర్వహించిన సర్వేలో వెల్లడైందన్నారు.
ఇప్పటికప్పుడు వైసీపీ ఎన్నికలకు వెళితే తాన కూడా ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమని రఘురామ ప్రకటించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన వైసీపీ నేతలు, ఎంపీలు తనపై అనర్హత వేటు వేయించే పనిలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు జగన్ ఇచ్చిన హామీలను తాను గుర్తు చేస్తున్నందుకే తనపై వారు కక్ష గట్టారని ఆరోపించారు. అందుకే, ఎంపీలంతా స్పీకర్ చుట్టూ తిరుగుతూ తన అనర్హత వేటుపై ఫోకస్ పెట్టారని ఎద్దేవా చేశారు.
పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని రఘురామ డిమాండ్ చేశారు. తనను పార్టీలోంచి తొలగించలేరని, పార్టీ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చని చెప్పారు. వైసీపీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ లోక్ సభ స్పీకర్ కు వైసీపీ ఎంపీలు చేసిన ఫిర్యాదును రఘురామ ఖండించారు.