ప్రపంచం మెచ్చిన భారతీయ పారిశ్రామిక దిగ్గజం, దాతృత్వానికి మారుపేరు, పలు టాటా గ్రూపు సంస్థల అధిపతి రతన్ టాటా(86) ఇకలేరు అన్న సంగతి తెలిసిందే. వయోభారానికి సంబంధించిన పలు అనారోగ్య సమస్యల కారణంగా ముంబైలో బుధవారం ఆయన కన్నుమూశారు. వేల కోట్ల ఆస్తులు ఉన్నా ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తి రతన్ టాటా. సంపదను కూడబెట్టుకోవడం కంటే విలువలతో కూడిన వ్యాపారం చేయడానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. అయితే దేశ పారిశ్రామికవేత్తల్లో ఆదర్శవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన రతన్ టాటా పెళ్లి మాత్రం చేసుకోలేదు. అందుకుగల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా గ్రూప్‌ను స్థాపించిన జమ్షెడ్జీ టాటాకు రతన్ టాటా మునిమనవడు. 1937 డిసెంబర్ 28న ముంబైలో నావల్ టాటా, సోనీ టాటా దంపతులకు రతన్ జన్మించారు. ఆయనకు పదేళ్లు ఉన్నప్పుడే నావల్ టాటా, సోనీ టాటా విడాకులు తీసుకున్నారు. ఆ టైమ్ లో అమ్మమ్మ నవాజ్‌బాయి టాటా వద్ద రతన్ పెరిగారు. అమ్మమ్మ ప్రేమ, మాటలే రతన్ టాటాను మానసికంగా దృఢంగా మార్చాయి.
ఇక అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో రతన్ టాటా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత అక్కడే రెండేళ్ల పాటు ఉద్యోగం చేశారు. అయితే ఆ టైమ్ లో ఒక అమ్మాయితో రతన్ టాటా ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు. కానీ నానమ్మ ఆరోగ్యం క్షీణించడంతో రతన్ టాటా ఇండియాకు వచ్చారు. కుటుంబంలోని కొన్ని పరిస్థితుల కారణంగా రతన్ మళ్లీ అమెరికా వెళ్లలేకపోయారు. ఏడేళ్లు ఇక్కడే ఉన్నారు. ప్రియురాలే తన కోసం ఇండియాకు వస్తుందని రతన్ టాటా భావించారు.
సరిగ్గా అదే సమయంలో అంటే 1962లో ఇండో-చైనా యుద్ధం కారణంగా సదరు అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను భారత్ పంపించడానికి నిరాకరించారు. దాంతో రతన్ టాటా లవ్ బ్రేకప్ అయింది. ఇంతలోనే టాటా గ్రూపును నడిపించాల్సిన బాధ్యత రతన్ పై పడింది. టాటా గ్రూపును అత్యున్నత శిఖరాలకు నిలబెట్టడం కోసం రతన్ నిరంతరం క్షణం తీరిక లేకుండా కష్టపడ్డారు. అందువల్లే పెళ్లి చేసుకోలేకపోయానని గతంలో ఓ సందర్బంగా రతన్ టాటా పేర్కొన్నారు.