వైసీపీ అధినేత జగన్.. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న తీరు అనేక విమర్శలకు దారి తీస్తోంది. ఆయన ఏదో అనుకుని.. ఏదో చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. కూటమి సర్కారు వైపు తప్పు లు చూపించి తాను సేఫ్గా ఉండాలని ఆయన భావించి ఉండొచ్చు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారి తీస్తున్నాయి. పైగా జగన్ చేస్తున్న విచిత్ర వాదనలు సర్వత్రా నవ్వు తెప్పిస్తున్నాయి.
ఆలయాల్లో సెక్యులరిజం(సర్వమత సమానత్వం-లౌకిక వాదం) ఉంటుందంటూ.. జగన్ వ్యాఖ్యానించా రు. వాస్తవానికి రాజకీయాల్లో సెక్యులరిజం ఉంటుందే తప్ప.. ఆలయాల్లో ఉండదన్న కనీస పరిజ్ఞానం జగన్కు లేదనే అనుకోవాలి. అన్ని మతాలు సమానమైతే.. అన్ని విధానాలు సమానమైతే.. ప్రత్యేకంగా ఆలయాలు ఎందుకు ఉంటాయి? అనేది జగన్ కి తెలియదా? ఎవరి ఆరాధనా విధానాలు వారివి. ఎవరి విశ్వాసాలు వారివి. అంతే తప్ప.. అందరినీ ఒకే గాటన కట్టేసి..సెక్యులరిజం ఉంటుందని ఎలా చెబుతారో ఆయనకే తెలియాలి.
అంతేకాదు.. ప్రపంచ ప్రఖ్యాత వాటికన్ సిటీకి వెళ్లేందుకు.. అన్య మతస్థులకు అవకాశం లేదు. మక్కాకు వెళ్లేందుకు కూడా ఇదే సూత్రం పాటించాలి. అక్కడ లేని సెక్యులరిజం.. తిరుమలకు వుంటుందని జగన్ ఎలా చెప్పారో ఆయనకైనా తెలుసా? అన్నది ప్రశ్న. ఎవరి మతం వారిది. ఎవరి దేవుడు వారికి సొంతం. అంతేకానీ.. అన్నీ కలాగాపులగం చేసేసి.. తిరుమలలో సెక్యులరిజం ఉంటుందని జగన్ చెప్పడం హాస్యాస్పదం.
పైగా.. నిత్యం వేదపారాయణ జరిగే తిరుమలకు అన్యమతస్థులను ఎలా అంగీకరిస్తారు? వారికి శ్రీవారిపై విశ్వాసం ఉంటే తప్ప! ఇదే కదా.. జగన్ను కోరింది! డిక్లరేషన్ ఇచ్చి.. దేవదేవుడి దర్శనం చేసుకోమని చెప్పారే తప్ప..వద్దని ఎవరూ చెప్పలేదు. కానీ, డిక్లరేషన్ ఇచ్చేందుకు అంగీకరించని జగన్.. సెక్యులరిజం అంటూ.. కొత్త పల్లవి అందుకున్నారు. మరి ఈ సెక్యులరిజం.. చర్చిలకు వర్తిస్తుందా? అనేది ఆయనే చెప్పాలి. ఇతర మతాల వారిని.. మతం మారకుండా చర్చిలకు అనుమతిస్తారా? అనేది కూడా ఆయనకే తెలియాలి. ఏదేమైనా.. జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి.