2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో 151 సీట్లతో ప్రభంజనం సృష్టించిన వైసీపీ..ఈ సారి కేవలం 11 సీట్లకే పరిమితం కావడం వంటి పరిణామాల నేపథ్యంలో పార్టీని వీడే నేతలు రోజు రోజుకీ పెరుగుతున్నారు. అయితే, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన వెంట ఉండేవారు ఉంటారని, పోయేవారు పోతారని జగన్ అంటుండేవారు. ఫలానా నేత పార్టీ వీడారు అని జగన్ ఎప్పుడూ ప్రస్తావించింది లేదు. కానీ, పార్టీ వీడిన మాజీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ విషయంలో మాత్రం జగన్ స్పందించారు.
వెంకట రమణ విషయంలో ఏనాడు తప్పు చేయలేదని, మోపిదేవి పార్టీ మారడం బాధాకరమని జగన్ ఆవేదన వ్యక్తం చేసిన వైనం చర్చనీయాంశమైంది. శాసన మండలి రద్దు చేసినప్పుడు మోపిదేవిని రాజ్యసభకు పంపామని అన్నారు. అయినా, రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదని జగన్ చెప్పారు. చీకటి తర్వాత వెలుగు రావడం సృష్టి సహజమని తెలిపారు. రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఏర్పడ్డాయని, విలువలు, విశ్వసనీయతే తమకు శ్రీరామ రక్ష అని జగన్ చెప్పారు. వ్యక్తిత్వమే మనల్ని ముందుకు నడిపిస్తుందని అన్నారు.
వైసీపీకి, వైసీపీ నేతలకు, తనకు కష్టాలు కొత్త కాదని, తన తండ్రి సీఎం అయినా కష్టాలు వచ్చాయని, పెద్దవాళ్లంతా ఏకమై తనపై తప్పుడు కేసులు పెట్టారని జగన్ గుర్తు చేసుకున్నారు. 16 నెలలు జైల్లో పెట్టి తనను వేధించారని జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. అయినా ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించారు కదా అని జగన్ ప్రశ్నించారు. మంచివైపు దేవుడు తప్పకుండా ఉంటాడని, రాబోయేది మన ప్రభుత్వమే అని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు.