బాలీవుడ్ నటి రాధికా ఆప్టే గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర లేదు. కొన్ని వెబ్ సిరీస్ లతోపాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన ఈ డస్కీ బ్యూటీ అవసరమైతే సెమీ న్యూడ్ గా నటించేందుకూ సై అంటుంది. ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితం ‘పార్చ్డ్’ అనే సినిమాలో రాధికా ఆప్టే కొన్ని అభ్యంతర సన్నివేశాల్లో నటించింది. ఆ సన్నివేశాలు సెమీ న్యూడ్ గా ఉండడమే కాకుండా…భారతీయులను అవమానించేలా ఉన్నాయంటూ నెటిజన్లు గతంలో విమర్శలు గుప్పించారు.
అయితే, ఆ సినిమా భారతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని తీసింది కాదని, అందుకే ఆ చిత్రంలో పాత్ర డిమాండ్ ప్రకారం తాను నటించాల్సి వచ్చిందని రాధికా వివరణ ఇచ్చింది. ఆ తర్వాత ఎలాగోలా ఆ వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా ఆ చిత్రంలోని మరికొన్ని సన్నివేశాలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. దీంతో, తాజాగా రాధికా ఆప్టేను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని ట్విట్టర్ లో పిట్ట కూత పెడుతోంది. రాధికా ఆప్టే నటించిన సినిమాలు చూడకూడదంటూ #BoycottRadhikaApte ట్రెండ్ అవుతోంది.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా తీస్తున్న చిత్రాల్లో రాధిక నటిస్తున్నారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 2005లో ‘వాహ్!! లైఫ్ హో తో హసీ’ చిత్రంతో తెరంగేట్రం చేసిన రాధిక…బాలీవుడ్ తో పాటు, సౌత్ లోను కొన్ని సినిమాల్లో నటించింది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటిస్తున్న రాధిక…బాలయ్య హీరోగా వచ్చిన లెజెండ్ చిత్రంతోపాటు వర్మ తెరకెక్కించిన రక్త చరిత్రలోనూ నటించింది.
అయితే, 2016లో విడుదలైన ‘పార్చ్డ్’ సినిమాలో రాధికా ఆప్టే అశ్లీల సన్నివేశాల్లో నటించిందని విమర్శలు వచ్చాయి. హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు రాధిక మచ్చతెస్తోందని, ఆమెతో సినిమాలు తీయవద్దంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఇటీవల ఆ సినిమాలోని మరి కొన్ని అశ్లీల సన్నివేశాలు వైరల్ కావడంతో ఆమెను బ్యాన్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరి, ఈ వ్యవహారంపై రాధికా ఆప్టే స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.