హుజురాబాద్‌లో దళిత ‘బంధు’మంటలు చెలరేగుతున్నాయి. దళితబంధు తాత్కాలిక బ్రేక్‌కు కారకులెవరు? ప్రతిపక్షాల కుట్రేనా? ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫిర్యాదుతో నిలిచిపోయిందా.? ఇందులో ప్రతిపక్షాలకు లాభం ఏమైనా ఉందా.. అధికార పక్షానికి అస్త్రం దొరికిందా? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దళిత బంధు ఆగిపోవడంతో హుజురాబాద్ కుతకుతలాడుతోంది. దళిత బంధు ఆగిపోవడానికి కారణం నీవంటే నీవు అని బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.
దళిత బంధు దగ్గరే ఆగదనీ.. ఇంకా ఎన్నో అట్టడుగు వర్గాల కోసం మరెన్నో కార్యక్రమాలను రూపొందిస్తాం సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. ఆయన మధ్యాహ్నం ప్రకటించారు. రాత్రి ఎన్నికల కమిషన్ దళితబంధుకు బ్రేక్ వేసింది. ఎన్నికల సమయంలో హుజూరాబాద్‌లో ఆగినా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ పథకం నడుస్తోందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఎన్నికల తర్వాత తిరిగి దళితబంధు పథాకాన్ని అమలు చేస్తామని భరోసా ఇస్తున్నారు.
టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు ఆగిపోవడానికి బీజేపే కారణమని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. దళితులను మోసం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల దళితబంధుపై బీజేపీ నేత ఈటల రాజేందర్ కేసు వేస్తామని ప్రకటించారని గుర్తుచేస్తున్నారు.
దళితబంధు ఆగిపోవడానికి కారణం బీజేపేనని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. బీజేపీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని టీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం హుజురాబాద్ మండలంలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆయనకు దళితబంధు సెగ తగలకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే బీజేపీ లేఖ వల్లే దళితబంధు నిలిచిపోయిందని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 7న కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను విడుదల చేశారు. దళితబంధు లబ్ధిదారుల ఖాతాలో కావాలనే నగదు జమ చేయటంలేదని విమర్శించారు. దళితబంధు విషయంలో అధికార పార్టీకి లబ్ధి చేకూరే విధంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని, అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేసినా నిధులను ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ హోల్డ్ చేశారని ప్రేమేందర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
అయితే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంటే కాంగ్రెస్ మాత్రం మౌనంగా ఉంటోంది. ఇప్పటివరకు ఆపార్టీ దళితబంధు ఆగిపోవడం ఎలాంటి ప్రకటన చేయలేదు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలుకు రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఐదు విడతల్లో రూ.2 వేల కోట్లు విడుదల చేశారు.
2021 ఆగస్టు 9న రూ.500 కోట్లు, ఆగస్టు 23న రూ.500 కోట్లు, ఆ తర్వాత వరుసగా మూడు రోజులపాటు రూ. 200 కోట్లు, రూ.300 కోట్లు, రూ.500 కోట్లు విడుదల చేశారు. తాజాగా సోమవారం మరో రూ.250 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే దళిత బంధు పథకం పాతదేనని సీఈసీకి కరీంనగర్ జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చారు.
గత మార్చిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లోనే ఈ పథకానికి ప్రభుత్వం రూ.1000 కోట్ల నిధులు కేటాయించిందని, ఆగస్టు 4న వాసాలమర్రి గ్రామంలో ప్రారంభమైందని నివేదికలో పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. అయినా.. ఇప్పుడు పథకాన్ని నిలిపివేయాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.