ఎవరి మంత్రి పదవులు ఊడతాయో? ఎవరికి కొత్తగా మంత్రి యోగం పట్టనుందో? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రివర్గ విస్తరణ త్వరలో జరుగుతుందని సీఎం జగన్ స్పష్టం చెప్పిన నేపథ్యంలో చర్చంతా దీని చుట్టే తిరుగుతోంది. దాదాపు 90 శాతం మంత్రులపై వేటు పడుతుందని జగన్ తేల్చిచెప్పడంతో ఉద్వాసనకు గురయ్యే నేతలు ఎవరనే ఆసక్తి మొదలైంది. మరోవైపు కొత్తగా కేబినేట్లోకి ఎవరిని తీసుకుంటారనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
జగన్ మంత్రివర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే జగన్ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చేశారు. పదవులు పోయిన మంత్రులకు జిల్లా, ప్రాంతీయ మండళ్ల పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెడతానని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న మహిళా మంత్రుల పదవులు కూడా ఊడడం ఖాయంగా కనిపిస్తోంది. మేకతోటి సుచరిత, పాముల పుష్ప శ్రీవాణి, తానేటి వనతి మహిళా మంత్రులుగా ఉన్నారు. వీళ్లు కూడా ఇప్పుడు ఆ పదవులు వదులుకోవాల్సిందేనని తెలుస్తోంది. ముఖ్యంగా హోంమంత్రిగా ఉన్న సుచరిత కూడా రాజీనామా చేయాల్సిందేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడా పదవి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది.
కొత్తగా మంత్రివర్గంలో చేరే నలుగురు మహిళల్లో ఒకరికి హోం మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెడ్డి శాంతి, అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, చిలకలూరి పేట ఎమ్మెల్యే విడుదల రజనీ, నగరి ఎమ్మెల్యే రోజాల్లో ఒకరికి ఆ అవకాశం దక్కుతుందని టాక్. పద్మావతి, రజనీలకు ఎక్కువ ఛాన్స్ కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఇద్దరూ తొలిసారి ఎమ్మెల్యేలు అయ్యారు. అందులో ఒకరు ఎస్సీ.. మరొకరు బీసీ కావడంతో ఈ సామాజిక వర్గాలు వాళ్లకు ప్లస్‌గా మారుతున్నాయని అంటున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు హోంమంత్రి అవడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఫైర్‌బ్రాండ్ రోజాకు మొదట హోం మినిస్టర్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆమెకు సామాజిక సమీకరణాలతో పాటు సొంత నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ఇప్పటికే నగరిలోని ఓ వర్గం వైసీపీ నేతలు రోజాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారనే టాక్ ఉంది. ఆమెకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారని సమాచారం. రెడ్డి శాంతికి కూడా సామాజిక సమీకరణాలే మైనస్ అయ్యాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.