గత కొద్ది రోజుల నుంచి ఏపీని భారీ వర్షాలు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలను వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా బుడమేరు వరద నీరు విజయవాడ పరిసర ప్రాంతాలను జల దిగ్బంధం చేసింది. దాదాపు ఎనిమిది రోజుల నుంచి విజయవాడు వాసులు నానా అవస్థలు పడుతున్నారు. ఇటువంటి కష్టకాలంలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఐదు రోజుల క్రితం విజయవాడలోని వరద ప్రాంత బాధితులకు రూ. కోటి విరాళం ప్రకటించారు.
అయితే ఆ విరాళాన్ని ఎలా వినియోగించాలనేది చెప్పకుండా.. పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మెలిక పెట్టారు. ఇక ఇంతవరకు ఆ కోటి రూపాయల విరాళం ఏమయ్యిందో ఎవరికీ తెలియదు. ఇలాంటి సందర్భాల్లో ఎవ్వరైనా సరే విరాళం ప్రకటిస్తే.. సీఎం రిలీఫ్ ఫండ్ కే నేరుగా అందిస్తుంటారు. లేదంటే విరాళం మాటెత్తకుండా తమ వంతుగా సహాయక కార్యక్రమాలు చేపడుతుంటారు. ప్రజల అవసరాలు తీరుస్తుంటారు. అయితే జగన్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం.
వరద బాధితులను ఆదుకునేందుకు కోటి రూపాయలు ప్రకటించిన పులివెందుల ఎమ్మెల్యే.. ఇంతవరకు ఆ సొమ్మను సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించలేదు. అటు ప్రజలకు ఉపయోగించలేదు. దీంతో జగన్ ప్రకటించిన కోటి రూపాయల విరాళంపై ఇప్పుడు జోరుగా చర్చలు జరుగుతున్నారు. ఇచ్చే ఉద్ధేశం లేనప్పుడు విరాళం ప్రకటించడం ఎందుకు జగన్? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.