మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఘటన మరింత ముదురు తోంది. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నా.. వదిలి పెట్టేది లేదని సర్కారు చెబుతుండడం.. దీనికి అనుగుణంగానే అధికారులు కూడా.. కీలక సాక్ష్యాలు సంపాయిస్తుండడంతో అసలు ఈ కేసు ఎలాంటి మలుపు తిరిగి ఎక్కడ ఆగుతుందనేది అందరికీ ఆసక్తిగాను, రాజకీయంగా దుమారంగానూ మారింది. ఈ కేసుల్లో రోజుకొక విషయం వెలుగు చూస్తోంది. జగన్ హయాంలో అసైన్డ్ మెంటు భూముల విషయంలో తీసుకున్న నిర్ణయా న్ని అడ్డు పెట్టుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సతీమణి పేరిట 5 ఎకరాల చెరువును రాయించుకున్నారని.. తాజాగా వెలుగు చూసింది.
అయితే.. ఇప్పుడు దీనిని మరింత కూపీ లాగిన పోలీసులు ఏకంగా పెద్ది రెడ్డి పేరిట ఆయన కుటుంబ సభ్యుల పేరిట 20 వేల ఎకరాల భూములు అక్రమంగా ఉన్నాయని చెబుతున్నారు. దీనికి సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చినట్టు కూడా తెలిసింది. ఇక, ఈ కేసులో ముని రత్న అనే పెద్ది రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి కోసం.. కూడా పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు.. గతంలో ఇక్కడ సబ్ కలెక్టర్లుగా పనిచేసిన వారిని సస్పెండ్ చేయడంతోపాటు..వారిపైనా కేసులు పెట్టారు. మొత్తంగా చూస్తే.. సబ్ కలెక్టర్ కార్యాలయం కేసువ్యవహారం.. రోజు రోజుకు ముడి పడుతోందే తప్ప.. ఎక్కడా తగ్గడం లేదు.
వాస్తవానికి పెద్దిరెడ్డి హస్తం దీనిలో ఉందని నేరుగా ప్రభుత్వం చెప్పడం లేదు. ఇదే విషయాన్ని ఆయన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డి కూడా చెప్పారు. తమ ప్రమేయం లేదని.. తమ పేరు చెప్పుకొని ఎవరైనా చేసి ఉంటే.. ఆధారాలు చూపించాలని కోరుతున్నారు. అంతేకాదు.. తమపై ఆరోపణలు చేసేవారిపై పరువు నష్టం కేసులు వేస్తామని కూడా హెచ్చరించారు. దీంతో అసలు వాస్తవం ఏంటనేది ఇప్పటికీ తేలలేదు. ఇక, సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్దేశపూర్వకంగా నే అగ్గి ఘటన జరిగిందన్నది అధికారులు చెబుతున్న మాట. దీనిలో 22ఏ సహా అసైన్డ్ భూములు, వివాదాస్పద భూములు, చుక్కల భూములకు సంబంధించి 2400 పత్రాలు కాలిపోయాయని అంటున్నారు.
అయితే.. అసలు పత్రాలుకాలిపోయాయని అనుకున్నా.. అవి డిజిటల్ మాధ్యమాల్లో నిక్షిప్తం అయి ఉన్నాయని.. దీనికి ఎందుకు ఇంత యాగీ చేస్తున్నారన్నది వైసీపీ అధినేత జగన్ మాట. నిజానికి సబ్ కలెక్టర్ నుంచి కలెక్టర్ వరకు కూడా.. అన్ని పత్రాలుసేఫ్గానే ఉంటున్నాయి. కానీ, దీనివెనుక.. ఏదైనా వ్యూహం ఉందనేది జగన్ చెబుతున్న మాట. కానీ, ఈ విషయంలో రాజకీయ జోక్యం లేదని.. నిజానిజాలను త్వరలోనే బయట పెడతామని.. అధికారులు చెబుతున్నారు. కానీ, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం.. ఎవరిపైనా నిర్ధారిత ఆరోపణలు చేయకపోవడం వంటివి పెద్దిరెడ్డిని ఒకరకంగా రాజకీయ వివాదంలోకి నెడుతున్నాయి. మొత్తానికి ఇప్పటికైతే.. పెద్దిరెడ్డి ఈ విషయంలో స్పందించలేదు. అసలు ఆయన ఎక్కడున్నారనేది కూడా తెలియదు. మరి ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.