తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితం మొత్తంలో గడిచిన ఐదేళ్లు పూర్తిగా భిన్నమైనవి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలుమార్లు చెప్పింది మర్చిపోకూడదు. ఏపీకి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తీవ్రమైన ప్రతికూలతను.. గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ప్రతి విషయానికి అనునిత్యం పోరాటం చేయాల్సి వచ్చేది. తాము అధికారంలోకి రాగానే వ్యవస్థను ప్రక్షాళన చేయటమే కాదు.. అతి చేసిన అధికారుల సంగతి చూస్తామని.. తప్పుడు విధానాలకు చరమగీతంపాడుతామన్న వ్యాఖ్యలు బోలెడన్నిసార్లు చేశారు.
గత ప్రభుత్వంలో అతి చేసిన అధికారుల సంగతి చూడాలని.. అధికారంలోకి రాగానే వారిపై చర్యలు వేటు పడాలని వేలాది వినతులు వెల్లువెత్తిన పరిస్థితి. కట్ చేస్తే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై తెలుగు తమ్ముళ్లే ఆగ్రహంతో ఉన్నారు. అదెంత ఎక్కువగా అంటే.. ధర్మవరం తెలుగుదేశం పార్టీకి చెందిన వందలాది మంది ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ ఆఫీసు ఎదుట ధర్నా చేపట్టే వరకు విషయం వెళ్లింది.
ఎందుకిలా? సొంత పార్టీనే అధికారపక్షంగా ఉంది కదా? అన్న సందేహాలు రావొచ్చు. కానీ.. ధర్మవరం తెలుగు తమ్ముళ్ల వాదన వేరేలా ఉంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనుకూలంగా పనిచేసి.. తెలుగుదేశం పార్టీ నేతలు.. కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిన అప్పటి పురపాలక కమిషన్ మల్లికార్జున్ ను తిరిగి ధర్మవరం ఎలా తీసుకొస్తారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంత్రి ఆఫీసు ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.
తమను ఇబ్బందులకు గురి చేసిన కమిషనర్ ను ధర్మవరానికి ఎలా తీసుకొస్తారని ప్రశ్నించటంతో పాటు..కమిషనర్ ను వెంటనే బయటకు పంపేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రాంతం మొత్తం నిండిపోయింది. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో భద్రతమధ్య కమిషనర్ మల్లికార్జునను మంత్రి ఆఫీసు నుంచి పోలీసుల వాహనంలో బలవంతంగా తరలించారు.
అనంతరం మంత్రి ఆఫీసు నుంచి బయటకు వచ్చారు. ఆ వెంటనే టీడీపీ శ్రేణులు మొత్తం ఆయన్ను చుట్టుముట్టి.. బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు నందిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. పరిస్థితి ఇబ్బందికరంగామారటంతో పోలీసులు జోక్యం చేసుకొని.. తెలుగు తమ్ముళ్లను బలవంతంగా పక్కకు పంపారు.అనంతరం మంత్రి వెళ్లిపోయారు. గత ప్రభుత్వానికి కొమ్ముకాసిన అధికారుల్ని ఏ రీతిలో దగ్గరకు చేర్చుకుంటారన్నది టీడీపీ తమ్ముళ్ల వాదనగా మారింది. ఏపీ మంత్రి సత్యకుమార్ బీజేపీకిచెందిన వారన్న విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై స్థానిక తమ్ముళ్లు పలువురు చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారు. తమఅధినేతకు ఏమైందో తమకు అర్థం కావట్లేదన్నారు. అధికారపక్షంగా తాము ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని అనుకోవటం లేదని.. కనీసం తమను వేధింపులకు గురి చేసిన అధికారులకుకీలక పదవులు కట్టబెట్టటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కాస్త వింటున్నారా?