ఏపీలో చరిత్రను తిరగరాస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధానిని నాశనం చేయాలని చూసిన నరకాసురుడిని(త్వరలో దీపావళి ఉందికదా.. ఆ ఉద్దేశంతో) రాజధాని రైతులు మట్టు బెట్టారని అన్నారు. తాజాగా అమరావతి రాజధానిలో పునర్నిర్మాణ పనులకు చంద్రబాబు పూజలు చేసి ప్రారంభించారు. ఇక్కడక్యాపిటల్ రీజియన్ డివలప్మ్మెంట్ అధారిటీ(సీఆర్ డీఏ) ఆఫీసు పనులను రూ.160 కోట్లతో తిరిగి చేపట్టనున్నారు. ఈ పనులకే చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని రైతుల సంకల్పం.. బలం.. వారు చేసిన పోరాటం ఫలిం చి.. రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువుదీరిందని చెప్పారు. దీంతో రాజధాని నిర్మాణం కూడా వడివడిగా ముందుకు సాగుతుందన్నారు. అభివృద్ధికి అడ్డుపడే నాయకులు, వ్యక్తులు, కుసంస్కారులు ప్రతి చోటా ఉన్నారని తెలిపారు. రాజధాని లేని ఏపీని అప్పగించినప్పుడు.. ఇక్కడ అమరావతిని నిర్మించాలని తలపోశామని చంద్రబాబు చెప్పారు. ఈ సమయంలోనే 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి పూలింగ్ పద్ధతిలో సేకరించినట్టు తెలిపారు.
రైతులు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. వారిని ఎలా గౌరవించాలో.. గత పాలకులకు తెలియలేదని, లాఠీలతో కొట్టించారని విమర్శించారు. రాష్ట్ర రాజధాని, సమాజ హితం కోసం రైతులంతా భూములు ఇచ్చారని తెలిపారు. కానీ, వారిత్యాగాలను కూడా గత ప్రభుత్వం అపహాస్యం చేసి.. నడిరోడ్డుపై నిలబెట్టిందన్నారు. అయినా.. పట్టు వీడకుండా.. రాజధాని కోసం మహిళలు, రైతులు వీరోచితంగా పోరాడినట్టు చంద్రబాబు ప్రశంసించారు.
‘‘రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం కావడంతో అమరావతిని ఎంపిక చేసుకున్నాం. మా నినాదం కూడా స్ఫస్టం చేశాం. `ఒక రాష్ట్రం, ఒక రాజధాని` అని చెప్పాను. ఎక్కడికెళ్లినా అదే తీర్మానం చేశాం. అయితే.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం, పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. రాజధానిగా మాత్రం అమరావతే ఉంటుంది’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.