మోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఎట్టకేలకు పెద్దల సభ (రాజ్యాసభ) ఆమోదాన్ని పొందింది. ఈ బిల్లుపై చర్చ.. ఓటింగ్ లకు సంబంధించి బుధవారం లోక్ సభలో ఏదైతే సన్నివేశాలు ఆవిష్క్రతం అయ్యాయో.. ఇంచుమించు అలాంటి సీన్లే రాజ్యసభలోనూ చోటు చేసుకున్నాయి. అర్తరాత్రి దాటే వరకుచర్చ.. అనంతరం అంశాల వారీగా డివిజన్ ను చేపట్టిన అనంతరం చివరకు సభ్యుల ఓటింగ్ ద్వారా ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు.
రాజ్యసభలో ఈ బిల్లుపై తీవ్రంగా చర్చ సాగింది. విమర్శలు.. ప్రతి విమర్శలతో రాజ్యసభ హాట్ హాట్ గా మారింది. బిల్లుపై చర్చకు చివరగా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇచ్చిన సమాధానం అనంతరం ఓటింగ్ నిర్వహించారు. అంతేకాదు.. పలు సవరణలకు సంబంధించిన తీర్మానాలకు ఓటింగ్ జరిగింది. ఈ బిల్లుకు అనుకూలంగా 128 మంది ఓట్లు వేయగా.. వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. అదే సమయంలో ప్రతిపక్షాలు చేసిన సవరణలు వీగిపోయాయి.
ఈ బిల్లుపై చర్చ నేపథ్యంలో రాజ్యసభకు కొందరు సభ్యులు నల్ల బ్యాడ్జిలను ధరించి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని.. ఆ మాటకు వస్తే ఏ ఒక్క మత విశ్వాసాలను దెబ్బతీయటం తమ సర్కారు ఉద్దేశం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సంక్లిష్టతల్ని తొలగించటం.. పారదర్శకతను తీసుకురావటంతో పాటు.. టెక్నలజీని అనుసంధానం చేయటం ద్వారా వక్ఫ్ బోర్డును మరింత మెరుగుపర్చటమే ప్రభుత్వ ఉద్దేశంగా పేర్కొన్నారు.
ఈ బిల్లుకు మతంతో ఎలాంటి సంబంధం లేదన్న కేంద్ర మంత్రి.. అన్ని వర్గాలకు చెందిన ముస్లింలను వక్ఫ్ బోర్డులో తీసుకురానున్నట్లుగా చెప్పారు. 2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులు.. ప్రస్తుతం 8.72 లక్షలకు పెరిగిన విషయాన్ని చర్చ సందర్భంగా పేర్కొన్నారు. ముస్లింలలో షియా.. సున్నీలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాల వారు వక్ప్ బోర్డు సభ్యులుగా కొనసాగేలా కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లుగా చెప్పారు. 22 మంది సభ్యులతో ఏర్పడే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూర్పుపై వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానాలు ఇవ్వటం గమనార్హం.
1913 -2013 మధ్య 18 లక్షల హెక్టార్ల భూమి వక్ఫ్ కింద ఉండగా 2013-25 మధ్య కాలంలో 21 లక్షల హెక్టార్లకు పెరిగిన వైనాన్ని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొకొన్నారు. వక్ఫ్ భూముల్ని ప్రభుత్వం తీసుకునే ఉద్దేశం లేదన్న ఆయన.. ఆస్తులను దుర్వినియోగం కాకుండా చూడటమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ బిల్లును రాజ్యసభలో మాజీ ప్రధాని కం జనతాదళ్ (సెక్యులర్) అగ్రనేత దేవేగౌడ.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు టీడీపీ.. జేడీయూ.. శివసేనలు (శిందే) మద్దతు ఇచ్చాయి. మరోవైపు ఈ బిల్లుకు కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకించింది. సమాజంలో మతపరమైన ఉద్రిక్తల్ని రెచ్చగొట్టటమే బీజేపీ ఉద్దేశంగా ఆరోపించారు.
సంయుక్త పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్షాలు చేసిన ఒక్క సిపార్సును కూడా ఈ బిల్లులో లేదని ఆరోపించారు. వక్ఫ్ బిల్లుపై లోక్ సభలో బుధవారం 14 గంటలకు పైగా చర్చ జరగ్గా..రాజ్యసభలో 8 గంటలకు పైనే చర్చ జరిగింది. లోక్ సభలో బిల్లుకు అనుకూలంగా 288 మంది.. వ్యతిరేకంగా 232 మంది ఓటేశారు. వక్ఫ్ బిల్లు పేరును.. ‘‘యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్ మెంట్ ఎంపవర్ మెంట్.. ఎపిషియెన్సీ అండ్ డెవలప్ మెంట్ బిల్లుగా పేర్కొన్నారు. ఉభయ సభల ఆమోదం నేపథ్యంలో రాష్ట్రపతి సంతకం కోసం ఈ బిల్లును ప్రభుత్వం పంపింది.