‘‘తోడేళ్లు గుంపుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది’’ అంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. ఆ తర్వాత ఆయన మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. విశాఖపట్నమే ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబోతోందని, త్వరలోనే పరిపాలన అంతా అక్కడికి వెళ్తుందని, తాను కూడా వైజాగ్‌లో అడుగు పెట్టబోతున్నానని జగన్ ప్రకటించేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
వైజాగ్ పేరు కూడా మార్మోగుతోంది. కానీ అధికారంలోకి రావడానికి ముందు, తర్వాత.. రాజధాని విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు.. వేసిన అడుగులు.. ఇప్పుడు జరుగుతున్నది చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. ముందేమో ప్రతిపక్షంలో ఉండగా అమరావతిని రాజధానిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అన్నారు. అధికారంలోకి రాగానే మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.
ఐతే అమరావతి నుంచి రాజధాని ఎక్కడికీ పోదు అని, అది శాసన రాజధాని అని.. పరిపాలన రాజధానిగా మాత్రమే వైజాగ్ ఉంటుందని అన్నారు. కానీ నెమ్మదిగా వైకాపా నేతల స్వరం మారుతూ వచ్చింది.
ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్లు అమరావతి, కర్నూలు పేరుకు మాత్రమే రాజధానులు అని, అసలు రాజధాని వైజాగే అవుతుందని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు జగన్ సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. వైజాగే ఏకైక రాజధాని అని చెప్పకనే చెప్పేశారు. ఇంతకుముందులా అది పరిపాలన రాజధాని అనే మాటను ఆయన వాడలేదు. వైజాగే రాజధాని కాబోతోందని ఢిల్లీ వేదికగా ప్రకటించేశారు. ఇక మూడు రాజధానులనేవి పేరుకే అని, దాని చుట్టూ జరిగిందంతా రాజకీయ డ్రామా అని స్పష్టం అయిపోయింది.
ఇదిలా ఉంటే అమరావతి నుంచి రాజధానిని తరలించడంపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అక్కడ ప్రభుత్వానికి మొదట్నుంచి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ కేసులు తెమలకుండా వైజాగ్‌కు రాజధానిని తరలించే ఛాన్సే లేదు. ఇదంతా తెలిసి కూడా వైజాగ్ వాసులను మభ్యపెట్టడానికి రాజధాని అక్కడికి వచ్చేస్తున్నట్లు ఊరిస్తూ రావడం కూడా ఒక రకమైన మోసమే. ఇలా మూడు ప్రాంతాలతోనూ వైసీపీ ఆడుకుంటోందన్నది స్పష్టం.