విశాఖ లో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ దేశానికి గంజాయి హబ్ గా మారిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. ఏపీకి విశాఖ రాజధాని అని చివరకు గంజాయికి రాజధానిగా మార్చారని జగన్ సర్కార్ ను దుయ్యబట్టారు. విశాఖ రాజధాని అంటూ చెబుతున్న వైసీపీ నేతలు ఒక్క ఇటుక కూడా వేయలేదని, కానీ విశాఖను డ్రగ్స్ కాపిటల్ గా ఎప్పుడో మార్చిన విషయం ప్రజలు అర్థం చేసుకోలేదని చురకలంటించారు. పిల్లల భవిష్యత్తును ఫణంగా పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదని ప్రశ్నించారు.
కాగా, ఎంపీ, ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్ ఛార్జీలకు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో అభ్యర్థులకు చంద్రబాబు కీలక సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ వర్క్ షాప్ జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులలు, వారు ప్రత్యేకంగా నియమించుకున్న నలుగురు మేనేజర్లు ఈ వర్క్ షాప్ నకు హాజరు కాబోతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అధికార పార్టీ కుట్రలు, ఎన్నికల్లో ప్రచారం, వ్యూహాల అమలుపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు.