ఏపీ సీఎం జగన్ గురువారం తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. తొలుత ఆయన నామినేషన్ వేశారు. అనంతరం.. భాకారాపేటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే.. ఈ మధ్య కాలంలో సంచలనం చోటు చేసుకుంది. జగన్ సొంత చిన్నాన్న, దారుణ హత్యకు గురైన వివేకానందరెడ్డి కేసుకు సంబంధించి, ఈ కేసులో జగన్ అనుసరిస్తున్న తీరును గురించి ప్రశ్నిస్తూ.. వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. “మీ నాన్న చనిపోతే ఏడ్చావ్.. బాబాయిని చంపేస్తే.. మనసు కరగదా!“ అని కీలక వ్యాఖ్య చేశారు.
దారుణ హత్య కేసులో నిందితులను కాపాడుతున్నారని, ఇదేనా ముఖ్యమంత్రిగా చేసిన ప్రమాణ సారాం శం, ఇదేనా నీ మార్కు పరిపాలన అని సౌభాగ్యమ్మ నిలదీశారు. “ఈ హత్య కేసులో నిందితులుగా సీబీఐ పేర్కొన్న వారికి టికెట్ ఇవ్వడం.. సరైందేనా?“ అని ప్రశ్నించారు. నిందితులను కాపాడుతున్నట్టు కాదా? అని అన్నారు. అంతేకాదు.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయనప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో.. అదేవిధంగా తన తండ్రిని చంపేయడంతో సునీత కూడా అంతకన్నా ఎక్కువగా బాధపడుతోందన్నారు.
“సొంత పార్టీ వైసీపీ వారే నీ చెల్లెళ్లను హేళన చేస్తున్నారు. నిందలు మోపుతున్నారు. అయినా నీలో ఇసు మంతైనా చలనం లేదా? నీ మనసు కరగదా!“ అని సౌభాగ్యమ్మ.. సీఎం జగన్ను ప్రశ్నించారు. సొంత కుటుంబంలోని వారే.. నిందితులుగా ఉన్నారని.. ఇలాంటి వారికి టికెట్లు ఇచ్చి.. సొంత చెల్లెళ్లపై అనరాని మాటలు అంటున్నా.. చూస్తూ నిర్లిప్తంగా ఉన్న నిన్ను చూస్తుంటే.. నా మనసుకు చాలా కష్టంగా ఉందని సౌభాగ్యమ్మ పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రిగా న్యాయం, ధర్మం, సత్యం వైపు నిలబడాలని ఆమె కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు సౌభాగ్యమ్మ బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు.