ఏపీ ముఖ్యమంత్రి బాబాయ్.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు బ్రేక్ పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. షాకింగ్ గా మారిన ఈ హత్య కేసు లెక్క త్వరగా తేలుతుందని భావించినా.. అనుకున్నంత వేగంగా సాగటం లేదని చెప్పాలి. ఇలాంటి వేళ.. మరో సమస్య ఈ కేసు విచారణకు అడ్డంకిగా మారింది.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న 15 మంది సీబీఐ అధికారుల్లో నలుగురికి కరోనా సోకి ఇంటికే పరిమితం కాగా.. తాజాగా మరో ముగ్గురు సైతం తాజాగా కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఈ కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా చెబుతున్నారు. వివేకా హత్య కేసు విచారణలో భాగంగా పలువురు అనుమానితుల విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా సీబీఐ అధికారులు కడప జిల్లాకు వెళ్లారు.
ఆ క్రమంలోనే ఏడుగురు అధికారులు కరోనా బారిన పడ్డారు. దీంతో.. వారందరిని కడప సిటీలోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన సీబీఐ అధికారులు ఢిల్లీకి వెళ్లిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో.. కేసు విచారణ తాత్కాలికంగా నిలిచిపోయినట్లుగా చెబుతున్నారు. అధికారులంతా కోలుకొని సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత మాత్రమే విచారణ మొదలు కానున్నట్లుగా తెలుస్తోంది.