దగ్గుబాటి రానా, సాయి పల్లవిల కాంబోలో వేణు ఉడుగుల తెరకెక్కించిన చిత్రం ‘విరాటపర్వం’ ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో, ఈ సినిమా ప్రమోషన్స్ లో రానా, సాయిపల్లవి, చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ సినిమాలో మావోయిస్టు ‘వెన్నెల’ పాత్రలో కనిపించిన సాయి పల్లవి గ్రామీణ నేపథ్యంలో పెరిగి ఉద్యమం పట్ల ఆకర్షితురాలైన అమ్మాయిగా కనిపించబోతోంది. అయితే, సాయి పల్లవి పోషించిన వెన్నెల పాత్ర…నిజ జీవితంలో దివంగత మావోయిస్టు తూము సరళ జీవితం ఆధారంగా తీర్చిదిద్దారు. దీంతో, అసలు తూము సరళ ఎవరు? ఆమె నిజ జీవిత కథ ఏంటి అన్న చర్చ జరుగుతోంది.
వరంగల్ లో విప్లవ భావాలున్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సరళ 16 ఏళ్ల వయసులోనే ఉద్యమం పట్ల ఆకర్షితురాలైంది. తుపాకీ పడితేనే న్యాయం జరుగుతుందనే విప్లవభావాలు ఇంటర్ చదివే రోజుల్లోనే ఆమెలో బలంగా నాటుకుని పోయాయి. దీంతో, డాక్టర్ కావాలని ఇంటర్ బైపీసీలో చేరిన సరళ…ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రాయకుండానే విప్లవంలో చేరింది. చివరకు అనూహ్య పరిస్థితుల్లో దళ సభ్యుల చేతుల్లోనే దారుణంగా చనిపోయింది.
తన చెల్లెలు సరళ డెత్ మిస్టరీ గురించి ఆమె అన్నయ్య మోహన్ రావు కొన్ని విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఉద్యమంలో ఉన్న సరళ దళ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేక పోయిందో, లేదంటే ఇంకేదైనా అయ్యిందో తనకు తెలియదని మోహన్ చెప్పారు. అయితే, సరళపై అనుమానం వచ్చిన దళ సభ్యులు ఆమెను పోలీస్ ఇన్ఫార్మర్ గా భావించారని, అందుకే, కొట్టి టార్చర్ చేసి చంపేశారని ఆరోపించారు.
వాళ్లు కొట్టిన దెబ్బలకు చనిపోవడంతో ఆ దళ సభ్యులే శవాన్ని దహనం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె చనిపోయినట్లు పేపర్ లో దళ సభ్యులు ప్రకటన విడుదల చేశారని, అప్పుడే ఆమె చనిపోయినట్లు తమకు తెలిసిందని అన్నారు. తన తండ్రి కూడా విప్లవ భావాలున్న వ్యక్తి అని, తన చెల్లెలిపై అనుమానం వచ్చాక ఉద్యమం నుంచి వెనక్కి పంపించేసి ఉండొచ్చని, విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకొని ఉంటే తన చెల్లెలు బతికి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత సరళ విషయంలో పొరపాటు జరిగిందని చెప్పారని, కానీ.. జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయిందని షాకింగ్ విషయాలను బయట పెట్టారు.