కాలం కలిసి రాకపోతే తాడే పామై మారి కాటేస్తుందని ఓ సామెత. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కు ప్రతి విషయం కలిసొచ్చింది. యూత్‌తో నిర్వహించిన అనేక సమావేశాలు, చర్చా కార్యక్రమాలు ఆయనకు ప్లస్ అయ్యాయి. ఆ సమావేశాల్లో యువతకు ప్రత్యేక హోదా సహా అనేక విషయాల్లో ఎన్నో ఆశలు కల్పించి.. ఒక ఉద్వేగంతో తనకు ఓటేసేలా చేసుకున్నారు జగన్.
కానీ గత ఐదేళ్లలో ప్రత్యేక హోదా ఊసే లేదు. ఉపాధి అవకాశాలు కూడా ఆశించిన స్థాయిలో లేక జగన్ పట్ల అత్యంత అసంతృప్తితో ఉన్న వర్గంగా యువత మారిపోయింది. ఇలాంటి టైంలో జగన్ తన పార్టీ కోసం పని చేసే సోషల్ మీడియా వారియర్స్‌తో ఒక సమావేశం ఏర్పాటు చేయగా.. అందులో వర్ధమాన పారిశ్రామికవేత్తలకు తన ప్రభుత్వం కల్పించే అవకాశాల గురించి మాట్లాడమంటే తెల్లమొహం వేయడం చర్చనీయాంశం అయింది.
ఇన్‌స్టా రీల్స్ ద్వారా పాపులర్ అయిన ఓ అమ్మాయి తనను తాను ఒక పారిశ్రామికవేత్తగా పరిచయం చేసుుకంటూ.. వర్ధమాన పారిశ్రామికవేత్తలకు మీరిచ్చే సలహా ఏంటి అని జగన్‌ను అడిగింది ఈ మీటింగ్‌లో. ఐతే ప్రశ్న స్పష్టంగా ఉన్నా జగన్ అర్థం కానట్లు అయోమయంగా ఫేస్ పెట్టారు. ఇటు అటు దిక్కులు చూశారు. మైక్ పట్టుకుని ఉన్న వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి, జగన్ పక్కనే ఉన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.. ఈ ప్రశ్న గురించి జగన్‌కు వివరించే ప్రయత్నం చేశారు.
అయినా ఆయన్నుంచి సమాధానం లేకపోయింది. దీంతో జగన్ తరఫున తాను సమాధానం చెబుతానంటూ లీడ్ తీసుకున్నాడు. ఆయనేం సమాధానం చెబుతాడా అని అందరూ ఆసక్తిగా చూస్తే.. జగన్ రాజకీయ నాయకుడు కావడానికి ముందే విజయవంతమైన పారిశ్రామిక వేత్త అని.. ఆయన జీవితమే ఒక స్ఫూర్తి పాఠం అని.. గూగుల్ చేస్తే అన్నీ తెలుస్తాయని చెప్పి ముగించారు. ఈ వీడియో నిన్నట్నుంచి వైరల్ అవుతోంది. ఇన్‌స్టా ఇన్ఫ్లూయెన్సర్ పారిశ్రామికవేత్తలా మాట్లాడడం.. ఆమె సింపుల్ ప్రశ్న వేసినా జగన్ తెల్లమొహం వేయడం.. గూగుల్ చేసి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని భార్గవ్ చెప్పడం.. ఇదంతా జగన్ అండ్ కో పరువు తీసే వ్యవహారంలా మారిపోయింది.