గత 50 ఏళ్లలో మునుపెన్నడూ లేనంత వరదలు విజయవాడ ను ముంచెత్తాయి. కృష్ణ, బుడమేరు వరద నగరంలో సగానికి పైగా ప్రాంతాలను జలమయం చేసింది. కొన్నిచోట్ల మోకాళ్ళ లోతు నీరు ఉండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎటు చూసినా కన్నీటి దృశ్యాలు గుండెను బరువెక్కిస్తున్నాయి. ఇప్పటికే 29 మంది వరదల్లో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే వరద తగ్గకముందే మరో ముప్పు విజయవాడ వాసులను వణికిస్తోంది. గత నాలుగు రోజులనుంచి వరద నీటితో సహజీవనం చేయడం వల్ల వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా బోడమేరు వరద బాధితులు జలుబు, దగ్గు, జ్వరం, నీరసం, ఒళ్ళు నొప్పులు, ఆస్తమా, షుగర్, బీపీ వంటి సమస్యలతో తీవ్రంగా సతమతమవుతున్నారు. ముంపు ప్రాంతాల్లో నుంచి బయటకు వస్తున్న బాధితుల్లో ఎక్కువ మంది వైరల్ జ్వరాలతోనే బాధపడుతున్నారు.
బాధితులంతా వైద్య శిబిరాలకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ వరద బాధితులతో కిటకిటలాడుతున్నాయి. అంబులెన్స్‌ల్లో కూడా మందులు అందిస్తున్నారు. ఒకటి, రెండు స్వచ్ఛంద సంస్థలు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి తమ వంతు బాధితులకు సాయం చేస్తున్నారు. ఇక కొన్ని చోట్ల వైరల్ జ్వరాలతో బాధపడుతున్నవారికి కనీసం డోలో-650 కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.
కాగా, గత నాలుగు రోజుల నుంచి విజయవాడలో వరద బాధితుల కోసం ప్రభుత్వం యొక్క సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. హెలికాప్టర్స్, డ్రోన్ల ద్వారా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు వరదల బాధితులకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు కూటమి సర్రార్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది.