ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెనుదుమారం రేగిన సంగతి తెలిసిందే. ‘మీ మనసు బీజేపీతో, తనువు టీడీపీతో ఉన్నాయి’ అంటూ చైర్మన్ వెంకయ్యనాయుడిని ఉద్దేశించి విజయసాయి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయసాయి వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం కూడా సీరియస్ అయింది. విజయసాయిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా వెంకయ్యనాయుడుపై చేసిన వ్యాఖ్యలను ఈ రోజు సభలో విజయసాయి ఉపసంహంరించుకున్నారు. రాజ్యసభ చైర్మన్‌పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని విజయసాయి రెడ్డి తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని, ఈ తరహా వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పారు. తాను ఆవేశంలో అలా వ్యాఖ్యానించానని, రాజ్యసభ చైర్మన్‌ను అగౌరవ పరచాలనుకోలేదని , ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అయితే, ఈ రోజు సభ ప్రారంభం కావడానికి ముందు విజయసాయిని కేంద్ర పార్లమెంటరి వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మందలించారు. ఆ వ్యాఖ్యలు ఉపసంహంరించుకొని వెంకయ్య నాయుడికి క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పెద్దల మందలింపుతో వెంకయ్యకు విజయసాయి క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో, అడుసు తొక్కనేల కాలు కడగనేల అంటూ విజయసాయిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీతో లేనని, తన హృదయం దేశ ప్రజలతో మమేకమై ఉందని చెప్పారు. వ్యక్తిగతంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌పై రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల చేసిన ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించాలని విజయసాయి కోరారు. అయితే, విజయసాయి లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. ఈ సందర్భంగా వెంకయ్యపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.