రాజకీయాల్లో కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన ఘనత ఏపీ అధికారపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని చెప్పాలి. రెండు దశాబ్దాల క్రితం రాజకీయాలకు.. ఇప్పటికి ఏ మాత్రం పోలిక లేని పరిస్థితి. గతంలో ప్రత్యర్థులపై ఆరోపణలు చేసేవారు. విమర్శల్ని సంధించేవారు. కానీ.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. దోషిగా సోషల్ మీడియా బోనులో నిలబెట్టేసి.. తీర్పులు ఇచ్చేసే వింత ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా ఏపీలో దేవతామూర్తుల్ని ధ్వంసం చేసే ఉదంతం పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది విజయనగరం జిల్లా రామతీర్థంలోని రాములోరి విగ్రహానని ధ్వంసం చేసిన ఘటన. ఈ ఉదంతంలో ఇప్పటివరకు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారే కానీ.. ఏ1.. ఏ2 లాంటివేమీ ఇప్పటివరకు జరగలేదు. అదే సమయంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కన్ను.. చెవులైన ఎంపీ విజయసాయి లాంటివారు ఒక అడుగు ముందుకేసి.. విగ్రహాల్ని ధ్వంసం చేస్తుంది బాబు కదా? అని ప్రశ్నించి మరీ తీర్పులు ఇచ్చేస్తున్నారు.
ఒకవేళ.. బాబే దోషి అయితే.. ఇంకెందుకు ఆలస్యం? ఆధారాలతో ఆయన్ను అదుపులోకి తీసుకుంటే సరిపోతుంది కదా? ఒకవేళ.. ఆయన తప్పు చేయలేదు.. ఆయన అనుచరులు తప్పు చేశారనే అనుకుందాం. ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు కదా? చేతిలో ఉన్న అధికారంతో తప్పులు చేసిన వారిని అరెస్టు చేసి బోనులోనిలుచోబెడితే సరిపోతుంది. అంతేకానీ.. అదే పనిగా సోషల్ మీడియాలో చంద్రబాబే చేయించినట్లుగా ట్వీట్ చేయటం సరికాదంటున్నారు. తాజాగా విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ పై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో తీర్పులివ్వడం వంటి ప్రమాదకరమైన ఈ ట్రెండ్ మరింత ముదిరితే.. నిజం అన్నది పక్కన పెట్టేసి.. నోటికి వచ్చినట్లు మాట్లాడేదే నిజం అనే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. అది మరింత దారుణ రాజకీయాలకు అలవాటుగా మారుతుందని చెప్పక తప్పదు.