సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పండుగ హడావుడి ఒక పక్క.. మరోవైపు పెద్ద సినిమాల హడావుడి మరో పక్క ఉంటుంది. తెలుగు వారికి పెద్ద పండుగ అయిన సంక్రాంతిని ముచ్చటగా మూడు రోజులు చేయటం.. దూర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు.. తమ సొంతూళ్లకు చేరుకోవటానికి వీలుగా ఈ పండుగకు ప్లాన్ చేసుకుంటారు.
తెలుగోళ్లకు పెద్ద పండుగ అయిన సంక్రాంతికి ఈసారి అగ్రహీరోలుగా వెలుగొందే చిరు.. బాలయ్యలకు చెందిన సినిమాలు రోజు తేడాతో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఏపీలో నెలకొన్న విచిత్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఈ ఇద్దరు అగ్ర హీరోల సినిమాలను దరిద్రపుగొట్టు రాజకీయంతో విద్వేషాన్ని పురిగొల్పేలా ఒక కుట్ర జరిగినట్లుగా రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఈ ఇద్దరు హీరోలు రెండు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావటం.. ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన ముఖ్యనేతలు రాజకీయంగా ఏకం అయ్యేందుకు అడుగులు పడుతున్నవేళ.. వారిద్దరి మధ్య దూరంపెంచేలా.. వారి వర్గాల మధ్య దూరం తెచ్చేందుకు వీలుగా ముష్టి ప్లాన్ ఒకటి వేశారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరుతో దూరమైన ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన అధినాయకత్వం.. ఇటీవల కాలంలో కలిసి పోరాడాలన్న దిశగా ప్లానింగ్ జరుగుతోంది.
ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. వచ్చే ఏడాది (ఒకవేళ ముందస్తు జరిగితే ఈ ఏడాదే అవుతుందనుకోండి) లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రెండు సామాజికవర్గాల మధ్య దూరం పెంచటం ద్వారా.. పరోక్షంగా ఒత్తిడిని పెంచి.. కలసి పోరు చేయాలని భావిస్తున్న రెండు ముఖ్యపార్టీలు కలవకుండా చేయాలన్న ప్లానింగ్ జరిగినట్లుగా చెబుతున్నారు. ఇందుకు ఐ ప్యాక్ సంస్థ ద్వారా కుట్ర చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
కుట్రకు సంబంధించిన వ్యూహంపై రాజకీయ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం.. ముందుగా విడుదలయ్యే వీర సింహారెడ్డి మూవీ బాగోలేదని.. హీరో నటన బాగోలేదని. సినిమా చెత్తగా ఉందంటూ రెండో హీరో అభిమానుల పేరుతో విశ్లేషణలు.. వ్యాఖ్యలు వచ్చేలా చేస్తారని.. వీటిని వాట్సాప్.. సోషల్ మీడియా ప్రచారానికి తెర తీస్తారని చెబుతున్నారు.
అలా జరిగిన వెంటనే.. రెండో రోజున విడుదలయ్యే మరో అగ్రహీరో సినిమా కూడా చెత్తగా ఉందని.. సినిమా అస్సలు బాగోలేదని.. మొదటి రోజు విడుదలైన సినిమా ముందు తేలిపోయిందని.. మొదట విడుదలైన హీరో అభిమానులు.. వారి వర్గానికి చెందిన వారు పోస్టులు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది.
దీంతో మొదట ఆయా హీరోల అభిమానుల మధ్య మొదలయ్యే వైరం.. మరింత మంట పెట్టి.. చివరకు రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య దూరం పెంచేలా.. వారి మధ్య విద్వేషం పెరిగేలా ప్లానింగ్ జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని టీడీపీ ముఖ్యనేత లోకేశ్ సైతం.. ప్రత్యర్థుల ట్రాప్ లో అస్సలు పడొద్దని.. ఈ తరహా ప్రచారం కోసం రానున్న మూడు నాలుగు రోజుల్లో 500 మంది సిబ్బంది బెంగళూరు.. తాడేపల్లి.. హైదరాబాద్ లో పని చేస్తున్న కార్యాలయాల ద్వారా కుట్రను అమలు చేస్తారన్న ప్రచారం సాగుతోంది.
ఈ వ్యవహారం కాస్తంత ముదిరిన తర్వాత.. థియేటర్ల వద్ద హీరోల బ్యానర్లను.. పోస్టర్లను చించటం.. అభిమానులపై ఏదో గొడవ పెట్టుకొని రచ్చ చేయటం లాంటివి చేసే వీలుందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే.. ఈసారి సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే సినిమాలకు సంబంధించిన విద్వేష పోస్టులన విషయంలో అతిగా స్పందించకుండా.. జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందన్న మాట వినిపిస్తోంది.
కొంతలో కొంత నయం ఏమంటే.. రెండు సినిమాలకు నిర్మాతలు ఒకే రావటం కాస్తంత కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. మరి.. ఈ తరహా కుట్ర జరుగుతుందని రాజకీయవర్గాల్లో నడుస్తున్న చర్చలో వాస్తవం ఎంతన్నది కాలమే డిసైడ్ చేయాల్సి ఉంటుంది.