అంతిమ వీడ్కోలు.. ప్రతి వ్యక్తి జీవితంలో చోటు చేసుకునే ఘటనే! ఉన్నతంగా జీవించినా.. అథమంగా బతికినా.. ఆఖరుకు ఆ ఆరు గజాల స్థలమే అందరికీ పరిమితం.. అన్నది వాస్తవం. ఎంత ఉన్నతంగా జీవించామనేది ప్రాణం ఉండగా వేసుకునే జీవిత కొలమాన మే అయినా.. ఆ ప్రాణమే పోయాక… అంతిమంగా ఎంత గౌరవంతో సంస్కారం జరిగిందనేది అంతే ముఖ్యం. మారుతున్న కాలంలో.. కుంచించుకుపోతున్న ఇళ్ల లోగిళ్ల కారణంగా… ప్రాణం లేని జీవిని పట్టుమని పది గంటలు ఉంచేందుకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కళ్లముందు కనిపిస్తున్నాయి.
ఆత్మీయుల ఆవేదనలు కళ్లకు కడుతున్నా.. ఆఖరి నిముషం ఎప్పుడా.. అంతిమ సంస్కారం ఎప్పుడా.. అనే ఎదురు చూపు లు.. ఇరుగు పొరుగు వారి నుంచి సూటిగా ప్రశ్నించే పరిస్థితులు సర్వసాధరణం అయిపోయాయి. దీంతో బతికుండగా ఎంత ఉన్నతంగా జీవించినా.. పార్థివంగా మారిన దేహాన్ని హడావుడిగా తరలించేయాల్సిన దైన్యం ఇటీవల కాలంలో సర్వసాధారణం అయిపోయింది. ఇక, విదేశాల్లో ఉన్న బంధువుల.. కొడుకులు, కూతుళ్లు వచ్చేవరకు ప్రాణం పోయిన జీవాన్ని.. రోజుల తరబడి ఉంచాలంటే.. ఇది మరింత కష్ట సాధ్యంగా మారిపోయింది. పోయినోళ్లందరూ.. మంచోళ్లే అయినా.. చుట్టూ ఉన్న లోకం మాత్రం `ఎప్పుడు తీసుకెళ్తారా?!`అనే చూస్తుంది!!
దీంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు వేలల్లోనే ఉన్నాయి. ఇక, అపార్ట్మెంట్ కల్చర్ అల్లుకుపోయిన ప్రస్తుత కాలంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు.. పోయిన వారికి ఆత్మీయంగా అంతిమ సంస్కారం నిర్వహించుకునే పరిస్థితి లేక.. కుమిలిపోవడం.. కుటుంబ సభ్యుల వంతైంది. తప్పని పరిస్థితిలో సుదూర ప్రాంతాల్లో ఉన్న మార్చురీలను ఆశ్రయించడం.. వేలల్లో ఖర్చులు భరించడం.. కూడా కళ్లకు కనిపిస్తున్నదే. అయితే.. ఇలాంటి సందర్భాలకు చెక్ పెడుతూ.. ఆత్మీయుల మధ్య ఆదరంగా.. అంతిమ సంస్కారాలు నిర్వహించుకునే వెసులు బాటు కల్పిస్తూ.. కృష్నాజిల్లా గుడివాడలో అత్యంత ఆధునిక వసతులతో .. వల్లేపల్లి సీతారామ్మోహన్రావ్ రోటరీ మార్చురీ భవనం ప్రారంభమైంది. దీనిలో అంతిమ సంస్కారాలను అత్యంత ఆదరంగా నిర్వహించుకునే వెసులుబాటు.. సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
బీజం పడిందిలా..
గుడివాడలో వల్లేపల్లి సీతారామ్మోహన్రావ్ రోటరీ మార్చురీ భవనం నిర్మాణం వెనుక.. చాలా కథ నడిచింది. పెరుగుతున్న గుడివాడ పట్టణంలో అద్దె ఇంట్లో శవాన్ని అనుమతించని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, విదేశాల్లో ఉన్న పిల్లలు ఇక్కడ తల్లిదండ్రులు మరణిస్తే వచ్చేందుకు కనీసం 24 గంటల సమయం పడుతుంది. మరి అప్పటి వరకు ఆయా పార్థివ దేహాలను భద్రపరిచే డీప్ ఫ్రీజింగ్ మార్చురీలు అందుబాటులో లేకపోవడంతో విజయవాడ, ఏలూరులకు ఆయా పార్థివ దేహాలను తరలించే పరిస్థితి నెలకొంది. ఆయా విషయాలను స్వయంగా చూసి చలించిపోయిన ఆడిటర్ పూర్ణచంద్రరావు దీనికి ఒక పరిష్కారం చూడాలని తలపోశారు. అయితే.. ఆయన ఈ పని చేయలేక పోయారు.
అనంతర కాలంంలో ఆయన కుమారుడు శ్రీకర్ బాబు కూడా ఈ సమస్యకు పరిష్కారం కోసం ఎంతో ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో రాజదర్భార్ మోహనరావు కొంత సాయం చేయాలని అనుకున్నారు. అయితే.. మోహనరావు కూడా గత సంవత్సరం మరణించారు. ఈ క్రమంలో శ్రీకర్బాబు వల్లేపల్లి శశికాంత్ తో విషయం చెప్పి సంప్రదించారు. దాతను గుర్తించడమే సగం విజయం సాధించడం అనే మాటను నిజం చేస్తూ.. తన తండ్రి ఇచ్చిన మాటకోసం తక్షణమే 30 లక్షలు ఖర్చు పెట్టేందుకు వల్లేపల్లి శశికాంత్ ముందుకొచ్చి ఆరు గంటల్లో నగదు ఏర్పాటు చేశారు. దీంతో గుడివాడ పట్టణంలో కనీవినీ ఎరుగని శ్మశానం ఆధునీకరణ ప్రణాళికలో సింహభాగం అయిన డీప్ ఫ్రీజింగ్ మార్చురీ, వెయిటింగ్ హాల్.. మహిళలు విడిగా కూర్చునే గది, బాత్ రూంతో కూడిన మరో వెయిటింగ్ హాల్ నిర్మించారు.
దాతకు సన్మానం
ఈ నెల 5వ తేదీ సాయంత్రం గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ వల్లేపల్లి సీతారామ మోహన్ రావు(రాజదర్బార్ రాజా) స్మారక డీప్ ఫ్రీజింగ్ మార్చురీ భవనం, వెయిటింగ్ హాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభను గుడివాడ రోటరీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ మలిరెడ్డి రవికుమార్ రెడ్డి నిర్వహించారు. రోటరీ గవర్నర్.. దాత వల్లేపల్లి శశికాంత్ ను ఘనంగా సత్కరించారు.
లభించే సదుపాయాలు ఇవీ..
+ డీప్ ఫ్రీజింగ్ మార్చురీ
+ వెయిటింగ్ హాల్
+ మహిళలు విడిగా కూర్చునే గది
+ బాత్ రూంతో కూడిన మరో వెయిటింగ్ హాల్