గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ ని ఇప్పట్లో కష్టాలు వీడేలా కనిపించడం లేదు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఏ71 గా ఉన్న వంశీ రిమాండ్‌ను తాజాగా సీఐడీ కోర్టు పొడిగించింది. అయితే వంశీ అరెస్ట్ అయింది ఆ కేసులో కాదు. ఆ కేసు పెట్టిన ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ ను అపహరించి, బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో ఫిబ్రవరి 13న వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులోనే ఉన్నారు.
మరోవైపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ రిమాండ్ నేటితో ముగియడంతో శుక్రవారం ఉదయం ఆయన్ను మరియు నిమ్మ లక్ష్మీపతిని గన్నవరం పోలీసులు జిల్లా జైలు నుంచి విజయవాడ సీఐడీ కోర్టుకు తీసుకొచ్చారు. న్యాయస్థానం వంశీకి ఏప్రిల్ 9 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను గురువారం సీఐడీ కోర్టు డిస్మిస్ చేసింది. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. బెయిల్ వస్తుందని ఎంతగానో ఆశపడ్డ వంశీకి మరోసారి నిరాశే ఎదురైంది.
అలాగే ఇవాళ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఎస్టీ, ఎస్సీ స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించబోతుంది. ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. మరికొన్ని గంటల్లో తుది తీర్పు రాబోతుంది. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనే వంశీకి బెయిల్ రాలేదంటే.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో దాదాపుగా రాకపోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే, బెయిల్ షరతుల్లో అతి ముఖ్యమైనది సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని. కానీ టీడీపీ ఆఫీస్ దాడి కేసులో అరెస్ట్ కాకముందే ఫిర్యాదుదారుడ్ని వంశీ కిడ్నాప్ చేసి బెదిదించారు. బలవంతంగా ఫిర్యాదును ఉపసంహరింప చేశారు. ఇప్పుడు బెయిల్ తెచ్చుకుని బయటకు వస్తే సాక్షులను ఇంకెంతలా ప్రభావితం చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.