కాస్తంత బుద్ధి ఉన్నోళ్లు కూడా మాట్లాడని మాటల్ని భాద్యత కలిగిన ప్రజాప్రతినిధుల నోటి నుంచి రావటానికి మించిన ఖర్మ ఇంకేం ఉంటుంది? వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వేళ.. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడిన వేలాది మంది శాస్త్రవేత్తల పుణ్యమా అని వ్యాక్సిన్ బయటకు వచ్చింది. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొని రూపొందించిన వ్యాక్సిన్ మీద ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా తీర్పులు ఇచ్చేయటం చూస్తే షాక్ తినాల్సిందే.
సంక్షోభ సమయాల్లో నిజాల కంటే అబద్ధాలే త్వరగా ప్రచారమవుతుంటాయి. తాజాగా కరోనా వ్యాక్సిన్ పరిస్థితి ఇలానే ఉంది. దీనికి తోడు సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడేయటం కూడా ఇలాంటి పరిస్థితికి కారణంగా చెప్పాలి.
ఇది సరిపోనట్లుగా సమాజ్ వాదీ నేతల నోటి నుంచి ఇష్టారాజ్యంగా మొదలైన మాటలు.. తిరిగి తిరిగి అనుమానపు రాక్షసిగా మారిన దుస్థితి. మన దేశంలోకి కోవాగ్జిన్.. కోవిషీల్డ్ టీకాలకు అనుమతి లభించింది. వారం లోపే పంపిణీ మొదలు కానుంది. ఇలాంటివేళలో.. ప్రజలకు ఇస్తే సరైన సమాచారం ఇవ్వాలి. లేదంటే.. అన్ని మూసేసుకొని మౌనంగా ఉన్నా తప్పు లేదు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. ఒళ్లు మండిపోతుంది.
వ్యాక్సిన్ తీసుకుంటే నపుంసకత్వం వస్తుందన్న వాదనకు మూలం సమాజ్ వాదీ పార్టీగా చెప్పాలి. కరోనా వ్యాక్సిన్ ను బీజేపీ వ్యాక్సిన్ గా అభివర్ణించిన సమాజ్ వాదీ ఛీప్ అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన.. సురక్షితమైన టీకాల్ని ప్రజలకు ఉచితంగా వేస్తామన్నారు. అఖిలేశ్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయో లేదో.. ఆయన శిష్యులు చెలరేగిపోయారు.
ఆ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. కరోనా వ్యాక్సీన్ పురుషుల్ని నపుంసకుల్ని చేస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో.. రాష్ట్రంలో పవర్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాక్సిన్ ను తాము నమ్మమన్న ఆయన.. ‘మా నాయకుడు అఖిలేశ్ కరోనా వ్యాక్సిన్ వేసుకోనని అన్నారంటే దాని వెనుక కచ్ఛితమైన కారణం ఏదో ఉంటుంది. దాని వెనకున్న నిజాలు ఉంటాయి. దాని వల్ల ప్రజలకు హాని కలిగే అవకాశం ఉండి ఉండొచ్చు. అది నపుంసకులుగా మారుస్తుంది. అఖిలేశ్ చెప్పారంటే అది సమాజ్ వాదీ పార్టీ నేతలకు మాత్రమేకాదు.. మొత్తం రాష్ట్రంలోని ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ కు దూరంగా ఉండండి’’ అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. వ్యాక్సిన్ లాంటి కీలక అంశాలపై సమాజ్ వాదీ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా సమాజ్ వాదీ నేత చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ స్పందించారు. టీకాల విషయంలో నేతలు రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. అఖిలేశ్ లాంటి నేత వ్యాక్సిన్ వేసుకోనని చెప్పటం బాధ్యతారాహిత్యమేనని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. డీసీజీఐ వీ.జీ. సోమని మాట్లాడుతూ.. ‘‘ఏ వ్యాక్సిన్ తీసుకున్నా జ్వరం.. నొప్పి.. అలర్జీ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ సర్వసాధారణంగా కనిపిస్తాయి. వ్యాక్సిన్ తీసుకుంటే పురుషుల్లో నపుంసకత్వం వస్తుందన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు’’ అని పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. డీసీఐజీ ప్రముఖుడు చెప్పిన మాటల కంటే.. సమాజ్ వాదీ నేత భాద్యతారాహిత్యంతో చేసిన వ్యాఖ్యలకే ఎక్కువ ప్రాధాన్యత లభించటం.. కొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా ఉండటం గమనార్హం.