చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోగా మారిన టాలీవుడ్ నటుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. అర డజన్ కు పైగా చిత్రాల్లో బాల నటుడిగా పని చేసిన మహేష్ బాబు.. 1999లో `రాజకుమారుడు` మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం విడుదలై ఇటీవలె 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాజకుమారుడు షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కె.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన రాజకుమారుడు మూవీని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీ దత్ నిర్మించారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో మహేష్ బాబు, ప్రీతి జింతా జంటగా నటించారు.ప్రకాష్ రాజ్, జయప్రకాశ్ రెడ్డి, సుమలత తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. మణిశర్మ స్వరాలు అందించారు. 1999 జూలై 30న విడుదలైన రాజకుమారుడు పాజిటివ్ టాక్ తో హిట్ గా నిలిచింది.
వంద రోజులు ఆడిన ఈ మూవీ ఫుల్ రన్ లో రూ. 10 కోట్ల రేంజ్ లో వసూళ్లను సాధించింది. తొలి సినిమాతోనే హిట్ అందుకోవడంతో పాటు ప్రిన్స్ అనే టాగ్ ను కూడా మహేష్ బాబు సొంతం చేసుకున్నాడు. ఇకపోతే రాజకుమారుడు చిత్రీకరణ సమయంలో మహేష్ బాబు, ప్రీతి జింతా మధ్య ఒక రొమాంటిక్ సీన్ ను ప్లాన్ చేశారట.
సీన్లో భాగంగానే డైరెక్టర్ రాఘవేంద్రరావు ఒక స్ట్రా ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ తీసుకువచ్చి ప్రీతి జింతాకు ఇచ్చారట. ఆమె తాగిన తర్వాత ఆ స్ట్రాతోనే మహేష్ బాబును కూల్ డ్రింక్ తాగమని రాఘవేంద్రరావు చెప్పారట. అది విన్న మహేష్ బాబు.. `నేను చేయను.. కావాలంటే నువ్వే చేస్కో` అని చెప్పి షాకిచ్చాడట. అంతేకాదు షూటింగ్ నుంచి వెళ్లిపోయాడట. ఈ సరదా విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు చెబుతూ తెగ నవ్వేశారు.