విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చేందుకు రాత్రికి రాత్రే ఆన్లైన్లో ఆమోదించిన కేబినెట్ తెల్లవారుతూ.. దానిని సభలో ప్రవేశ పెట్టింది. అనుకున్న విధంగానే.. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్పు చేశారు. అయితే.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రవైద్యరంగంలో అనేక సంస్కరణలు తీచ్చారని.. అయినా.. ఆయనకు తగిన గుర్తింపురాలేదని.. క్రెడిట్ దక్కలేదని చెప్పారు.
అందుకే.. ఆయన పేరుతోవిశ్వవిద్యాలయాన్ని చూడాలని భావిస్తున్నామన్నారు. ఇక, ఎన్టీఆర్ మంచి నటుడని.. మంచి పాలకుడని.. జగన్ కీర్తించారు. అంతేకాదు.. ఆయనను అపకీర్తి పాలు చేయాలని తమకు లేదన్నారు. అయినప్పటికీ.. వైఎస్‌కు క్రెడిట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు జగన్ చెప్పుకొచ్చారు. అయితే.. అసలు ఎన్టీఆర్ చేయంది ఏంటి? ఈ యూనివర్సిటీ విషయంలో వై ఎస్ చేసింది ఏంటి? అనేది చర్చకు వస్తోంది.
అప్పట్లో రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నీ ఆయా జిల్లాల్లోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉండేవి. వాటి ద్వారానే విద్యార్థులకు డిగ్రీల అందజేసేవారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా.. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని నిర్ణయించారు. దీంతో 1986 నవంబర్ 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరిట ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. అంటే.. అప్పటి వరకు యూనివర్సిటీ మన రాష్ట్రంలో లేదు. కేవలం కాలేజీలకు మాత్రమే పరిమితం అయ్యారు. మద్రాస్, తిరువనంతపురం, బెంగళూరుకు వెళ్లేవారు.
అలాంటి పరిస్థితిని అన్నగారు మార్చారు. ఈ క్రమంలో నే ఆయన యూనివర్సిటీకి ప్రాణం పోశారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో 1996 జనవరి 8న ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విశ్వవిద్యాలయం పేరు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీగా మార్చారు. వైఎస్ హయాంలో ‘డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం’గా పేరు మార్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది. సో.. ఎలా చూసుకున్నా.. వైఎస్ ప్రమేయం లేదన్నది స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.