టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా వెలిగిపోతున్న అల్లు అర్జున్…పుష్ప సినిమా తర్వాత ఐకాన్ స్టార్ గా మారి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప సినిమాతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయి..అంతర్జాతీయ స్థాయిలో రష్యాలో సైతం ఈ సినిమాను విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ నుంచి ‘గోల్డెన్ వీసా’ను అల్లు అర్జున్ అందుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరోగా బన్నీ చరిత్ర సృష్టించాడు.
ఈ వీసా అందుకున్న సంతోషాన్ని బన్నీ తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. ‘‘ఒక మంచి అనుభూతిని ఇచ్చినందుకు దుబాయ్‌కి ధన్యవాదాలు. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు థ్యాంక్స్. త్వరలో మళ్లీ కలుద్దాం’’ అంటూ బన్నీ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. వాస్తవానికి, ఈ గోల్డెన్ వీసాను అతి కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే యూఏఈ ప్రభుత్వం ఇస్తుంది. బాలీవుడ్ హీరోలు షారూక్ ఖాన్, సంజయ్‌దత్, సునీల్ షెట్టి, నటి ఊర్వశి రౌతేలా, హీరో వరుణ్ ధావన్, మలయాళ నటులు మోహన్‌లాల్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ వంటి వారు గోల్డెన్ వీసా అందుకున్న జాబితాలో ఉన్నారు.
తాజాగా ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ చేరారు. ఈ గోల్డెన్ వీసా పొందే వ్యక్తులకు యూఏఈ రాజధాని అబుదాబీ లేదా దుబాయ్ తదితర సిటీల్లో పదేళ్ల వరకు నివసించే వెసులుబాటు ఉంటుంది. 2019లో ఈ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం గోల్డెన్ వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాను ఆటోమెటిక్‌గా పునరుద్ధరిస్తుంది అక్కడి ప్రభుత్వం. గోల్డెన్ వీసా ఉన్నవారు అక్కడ సొంతంగా వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు.