నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం రకరకాల పథకాలు ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 12 ఏళ్ల లోపు చిన్నారులందరూ ఆర్టీసీ బస్సుల్లో శాశ్వతంగా ఉచితంగా ప్రయాణించేలా కొత్త పథకం తెచ్చేందుకు పావులు కదుపుతోంది. ఈ ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన ప్రకటన చేశారు.
12 ఏళ్ల లోపు పిల్లలు ఉచితంగా ప్రయాణిస్తే వారితో పాటు తల్లిదండ్రులు కూడా వస్తారని, తద్వారా ఆదాయం పెరుగుతుందని, ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరుగుతుందని బాజిరెడ్డి అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ బస్ భవన్లో నిర్వహించిన వేడుకలలో పాల్గొన్న బాజిరెడ్డి ఈ ప్రకటన చేశారు. ఈ వేడుకల్లో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా పాల్గొన్నారు.
అంతకుముందు, న్యూఇయర్ సందర్భంగా శనివారం రోజు 12 ఏళ్ల లోపు చిన్నారులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సజ్జనార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సజ్జన్నార్ వచ్చిన తర్వాత ఆర్టీసీలో తన మార్క్ ప్రక్షాళనకు నడుం బిగించిన సంగతి తెలిసిందే. ర్యాపిడో బైక్ యాడ్ ఆర్టీసీని అవమానించేలా ఉండడంతో దానిని తొలగించాలంటూ సజ్జన్నార్ డిమాండ్ చేశారు. దీంతోపాటు,ప్రయాణికులను ఆకర్షించేందుకు వినూత్న పథకాలతో ముందుకు వస్తున్నారు.