https://twitter.com/Deepika_NCBN/status/1521115134348828672
ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ కు అనవసరంగా టీఆర్ఎస్ నేతలే ప్రకారం కల్పించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కేఏ పాల్ చాలా సరదాగా ఉంటారు. మిగిలిన పార్టీల నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలతో బాగా వేడి పెరిపోతున్నపుడు పాల్ ప్రవేశం జనాలకు నవ్వులు పూయిస్తుంది. అమెరికా అధ్యక్షుడిని తానే హైదరాబాద్ కు తీసుకొచ్చానని, బైడెన్ గెలుపులో తనదే కీకలపాత్రని ఇలా సంబంధంలేని జనాలు నమ్మలేని విషయాలను వివరిస్తుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో తనంటే జగన్మోహన్ రెడ్డి, కేసీయార్ వణికిపోతున్నారని ఏదేదో మాట్లాడుతుంటారు. ఎన్నికలు స్వేచ్చగా జరిగితే తన ముందు ఏ పార్టీ కూడా నిలబడలేందంటారు. అలాంటిది వడగళ్ళ వానతో నష్టపోయిన రైతులను పరామర్శ చేసేందుకు పాల్ వెళుతుండగా ఆయనపై దాడి జరిగింది. సిరిసిల్ల జిల్లాలోని తంగెళ్ళపల్లి మండలంలోని బస్వాపూర్ గ్రామంలోని రైతులు కష్టపడి పండించిన పంటంతా వడగళ్ళ వాన కారణంగా దెబ్బతినేసింది.
వడగళ్ళ వానతో దెబ్బతిన్న తమకు సాయం చేయమని రైతులు తనను అడిగిన కారణంగానే తాను ఆ గ్రామానికి వెళుతున్నట్లు పాల్ చెప్పారు. బస్వాపూర్ గ్రామానికి పాల్ తన మద్దతుదారులతో వెళుతున్నపుడు మధ్యలో జక్కాపూర్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రోడ్డు మీదకు వచ్చి పాల్ పోలీసులతో మాట్లాడుతున్నపుడు టీఆర్ఎస్ నేత అనీల్ రెడ్డి పాల్ చెంపపై గట్టిగా కొట్టారు. దాంతో అక్కడ గందరగోళం మొదలైంది.
ఎప్పుడైతే పాల్ పై దాడి జరిగిందో వెంటనే మీడియా ఆ ఘటనను చాలా పెద్దది చేసేసింది. ఘటనపై మెజారిటి ఛానళ్ళు పాల్ తో లైవ్ ఇన్ ఇవ్వటం విచిత్రం. ఎప్పుడైతే ఛానళ్ళు లైవ్ ఇన్ ఇచ్చారో ఇక పాల్ రెచ్చిపోయారు. తెలుగు రాజకీయాల్లో తనకెంత ప్రాధాన్యతుంది, తానంటే మిగిలిన పార్టీలు ఎలా భయపడుతున్నాయి ? తనను హత్య చేయటానికి కొందరు ఎంతగా ప్రయత్నిస్తున్నారు అనే విషయాలను పదే పదే డప్పు కొట్టుకున్నారు.
తాను ఎక్కడ బహిరంగసభలు పెట్టినా లక్షలమంది జనాలు ఎందుకు వస్తారనే విషయాలను చెప్పుకున్నారు. పాల్ తో లైవ్ చూస్తూ సీరియస్ విషయాన్ని కూడా జనం ఎంజాయ్ చేసే పరిస్థితి. మొత్తానికి టీఆర్ఎస్ నేత చేసిన ఒక పనికిమాలిన పని పాల్ కు ఎంత ప్రచారం తెచ్చిపెట్టిందో అర్ధమైపోతోంది.