‘తానా’ లో వచ్చే టర్మ్ కొరకు జరుగబోయే ఎలెక్షన్ల విషయమై వివిధ పదవుల్లో ఉన్నవారిలోను, ‘తానా’ రోజువారీ వ్యవహారాల్లో సమాచారం ఉండే వారిలోనే కాక సాధారణ సభ్యుల్లోనూ జరుగుతున్న చర్చలు అనేక మెలికలు తిరుగుతూ చలికాలం లో కూడా మంచి వేడిని రగిలిస్తోంది. ముఖ్యంగా అత్యున్నత పదవైన ‘ప్రెసిడెంట్ ఎలెక్ట్’ త్రిముఖపోటీని నివారించటానికి ప్రయత్నాలు క్రియాశీలకంగా మొదలైయ్యాయి.చర్చల్లో నలుగుతున్న ముగ్గురిలోకి వయస్సులోనూ, ‘తానా’ అనుభవం లోను సీనియర్ అయిన ‘శ్రీనివాస గోగినేని’ ఇప్పటికే ఒకసారి ఎలక్షన్స్ పాల్గొని ఉన్నందున, గాడ్ ఫాదర్ వ్యవస్థను బహిరంగంగా వ్యతిరేకించేవానిగా చరిత్ర ఉన్నందున, అధిష్ఠానంగా భావించుకొనేవారు ఆయనను మినహాయించి మిగతా ఇద్దరిపై ప్రస్తుతానికి దృష్టి సారించారు.
వారిద్దరిలోను తేలికగా డీల్ చేయవచ్చు అని భావించి ‘నిరంజన్ శృంగవరపు’ పై తమదైన పద్దతిలో వరుసగా సామ, దాన, భేద, దండోపాయాల ప్రయోగాలను ఒక్కొక్కటిగా మొదలుపెట్టినట్లు, పోటీనించి ప్రస్తుతానికి తప్పుకుంటే వచ్చే టర్మ్ అవకాశం ఉంటుందని అడుగుతున్నట్లు పక్కా సమాచారం. అయితే తాను చేసిన సేవలపైనా, తనకు మద్దుతుగా ఉన్న వారిపైన ఉన్నగట్టినమ్మకంతోనూ వచ్చే టర్మ్ అనేది ఒక ‘మిధ్య’గా భావించి ఇప్పటివరకు ససేమిరా అంటున్నట్టు, అలాగే ఉంటానని తమ వర్గానికి చెప్పుతున్నట్లు తెలియవస్తోంది. ‘నమస్తె ఆంధ్ర’ అయన వివరణ కొరకు ప్రయత్నించగా మాట్లాడిన విషయాన్ని ధృవీకరిస్తూ ప్రస్తుత పోటీ నించి తప్పుకునే విషయంలో ఎటువంటి అవకాశం ఇవ్వలేదనీ పోటీలో ఉండటం 200% ఖాయమని చెప్పారు.
ఇదే సమయంలో ‘నరేన్ కొడాలి’ వర్గానికి సన్నిహితుల వద్దనుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఆయన ఎన్నిక చాల తేలిక విషయమని మిగతా వారిని తప్పించటం ఎలాగో తమ అధిష్టానానికి తెలుసునని, ఎంత సమయం పడుతుందనేది చెప్పలేకపోయినా జరుగబోయేది ఇదేనని చెప్తున్నారు. పైగా ‘నరేన్ ‘అధిష్టానానికి అత్యంత ప్రీతి పాత్రుడైనందున వారు చేసే ప్రతి ప్రయత్నం చివరకు ఆయనను గెలిపించడానికే అనుకుంటున్నారు. అదేసమయంలో ‘శ్రీనివాస గోగినేని’ ఒకసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎన్నిక ఖాయం కనుక, అనుకోని పరిణామాలను ఎదుర్కుంటానికి సమాయత్తం కావలసిందేననీ భావిస్తున్నారు. ఇదంతా గమనిస్తూ వ్యవహారాలపై మంచి అవగాహన ఉన్నవారు జరుగబోయే ఎలక్షన్స్ తరువాత ‘తానా’ సంస్థ భవిష్యత్ గతీ గమనాలు తీవ్రంగా మారిపోయే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.
ఇక సరిగ్గా ప్రజాస్వామ్యయుతంగా ‘తానా’ ఎలక్షన్స్ జరిగితే,అనేక పదవులు రంగంలో ఉన్నందున ఎన్నికల హడావుడి అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తించడం ఖాయం. ఎగ్జిక్యూటీవ్ కమిటీలో 12 జాతీయ స్థాయి, 18 రీజినల్ స్థాయి, తానా ఫౌండేషన్ లో 7, బోర్డులో 3 కలిపి మొత్తం 40 స్థానాలకు పోటీ ఉంటే జరిగే కోలాహలం అంతా ఇంతా గాకుండా పోటీదారుల మద్దతు దారులు, పరిచయస్తులు ఉన్న అమెరికా 50 రాష్ట్రాల్లోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనీసం రెండు నెలలపాటు ఏంతో హడావిడి, ఆసక్తికర పరిణామాలు సంభవించవచ్చు. అనేక స్థాయిల్లో పైరవీలు, ప్రలోభాలు, ఆవేశకావేశాలు, బుజ్జగింపులతో సందడి వాతావరణం నెలకొనటం ఖాయం.
‘తానా’ నాయకత్వం లోను, ముఖ్య కార్యక్రమాల్లోనూ, తెలుగు వారి సంఖ్యలోనూ, చిత్ర విచిత్ర రాజకీయ చరిత్రతోనూ ప్రఖ్యాతి గాంచిన ‘టెక్సాస్’ రాష్ట్రములోని పరిస్థితిని పరిశీలిస్తే క్రింది విషయాలు అర్ధమౌతున్నాయి.ఈ ప్రదేశం నుంచి ‘రీజినల్’ స్థాయి పొజిషన్ నుంచి’ ప్రెసిడెంట్ ఎలెక్ట్’ పోసిషన్ వరకు ఉన్న అన్నిపదవులకు ఒకేసారి పోటీీ చేయగలిగినంత మందికి అర్హత ఉంది. కొత్త ఔత్సహికుల్లో ‘దినేష్ త్రిపురనేని’,’కుమార్ నందిగం’, ‘రత్న ప్రసాద్ గుమ్మడి’, ‘శ్రీనివాస్ కొమ్మినేని’, ‘కల్పనా నూకవరపు’, సురేంద్ర వీరమాసునేనిి’, ‘సతీష్ కొమ్మన’, ‘శ్యామ్ యలమంచిలి’, ‘ప్రవీణ్ కొడాలి’ తదితరులతో పాటు ఇప్పటికె కొన్ని పదవులు నిర్వహించియున్న ‘శ్రీకాంత్ పోలవరపు’, ‘సాంబా దొడ్డ’, ‘లోకేష్ నాయుడు కొణిదెల’, ‘మురళి తాళ్లూరి’, ‘అనిల్ వీరపనేని’, ‘వినోద్ ఉప్పు’ తదితరులు తగిన అవకాశం కొరకు ప్రయత్నించవచ్చు. అంతేగాక అత్యంత కీలకమైన పొజిషన్ల కొరకై ‘మురళి వెన్నం’, ‘చలపతి కొండ్రకుంట’, ‘Drప్రసాద్ నల్లూరి’, ‘మంజు కన్నెగంటి’, ‘రాజేష్ అడుసుమిల్లి’, ‘నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి’ తదితరులు పోటీ చేసే అర్హత కలిగి, పరిస్థితుల్ని తీవ్రంగా గమనిస్తున్నట్లు ఊహాగానం.ప్రత్యక్ష ఎన్నికలో పాల్గొనే ఆలోచన లేనప్పటికీ, ఈ ఎలక్షన్ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే గలిగిన వారిలో గత అధ్యక్షులైన ‘రాజేంద్ర ప్రసాద్ సూదనగుంట’, ‘మల్లికార్జునరావు చలసాని’, ‘ప్రభాకర్ కాకరాల’, ‘పద్మశ్రీ ముత్యాల’, ‘ప్రసాద్ తోటకూర’ లతో పాటు ‘రామ్ యలమంచిలి’, ‘కేసి చేకూరి’, ‘సుగన్ చాగర్లమూడి’ తదితరులున్నారు. వీరేకాక ఇంకా బయటపడని, దృష్టిలోకి రాని అనేకమంది త్వరలో వెలుగులోకి వస్తారని తెలుస్తోంది. వెరసి ‘టెక్సాస్’ రాష్ట్రం ఒక్కటే మినీ జాతీయ ‘తానా’ ఎలక్షన్ స్థాయి లో రకరకాల పరిణామాలతో ఆశ్చర్యపరచ వచ్చునని తెలుస్తోంది
ఏదేమైనా ప్రజాస్వామ్యయుతంగాా ఎలక్షన్లు జరిగి అనుభవమున్న నాయకులు ఔత్సాహిక కొత్త తరంతో కలిసి కార్యవర్గాల్లోకి వస్తే సరికొత్త ‘తానా’ను చూడాలని ఉవ్విల్లూరుతున్న ‘తానా’ అభిమానులకు, తెలుగు ప్రజలకు పండగే.