బీజేపీ..రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలం?సీఎం రమేష్

బీజేపీ…. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి, జగన్‌కు అనుకూలంగా ఉందన్న సంకేతాలు వెళుతున్నాయన్న విషయాన్ని,  ఎంపీ సీఎం రమేష్… చింతన్‌బైఠక్‌లో పాల్గొన్న అగ్ర నేతల దృష్టికి తీసుకువెళ్లారు.  ‘మన పార్టీ వైసీపీతో కలసి ఉందన్న సంకేతాలు వెళ్లడం పార్టీ భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించేదే. ఇది పార్టీ కార్యకర్తల నైతికస్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి దీనిపై ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని’ రమేష్ బలంగా వాదించారు. ఏపీని అధిష్ఠానం సీరియస్‌గా తీసుకోవడం లేదన్న భావన నెలకొన్నందున, దానిని నాయకత్వం తొలగించేలా సంకేతాలివ్వాలన్నారు.  ఆయన వాదనను మరికొందరు నేతలు కూడా బలపరిచారు.  దానిపై జోక్యం చేసుకున్న అధ్యక్షుడు సోము  వీర్రాజు.. మనం ప్రభుత్వాలు-పార్టీలకే  వ్యతిరేకం తప్ప, వ్యక్తులకు వ్యతిరేకం కాదని, వ్యక్తులను నిందించాల్సిన పనిలేదన్నారు.  కాబట్టి …  ఏదైనా, ‘వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలుగానే’  విమర్శించాలని సూచించారు.

అందుకు స్పందించిన సీఎం రమేష్.. మరి అదే  విధానమయితే, మీరు చంద్రబాబును ఎందుకు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని ప్రశ్నించడంతో, వీర్రాజు మౌనం వహించారు. ఈ సందర్భంగా సీఎం రమేష్‌పై తొలుత,  సోము వీర్రాజు వ్యంగ్యాస్త్రం సంధించారు.  ‘మీరు అప్పుడప్పుడు చంద్రబాబును కూడా విమర్శించాలండీ’ అనడంతో, రమేష్ ఫైర్ అయ్యారు. ‘నేను జగన్-బాబును కూడా విమర్శిస్తున్నాను’ అని అనడంతో మెత్తబడిన వీర్రాజు.. ‘నేనేదో సరదాగా అన్నానండీ’అని చల్లబరిచే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సునీల్ తీరుపైనా రమేష్ ఫైర్ అయ్యారు. మధ్యలో అడ్డువచ్చిన సునీల్‌ను ఉద్దేశించి,  ‘మీరు వినడం నేర్చుకోండి’ అని రమేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ దశలో జోక్యం చేసుకున్న సతీష్‌జీ.. వైసీపీతో మనకు ఎలాంటి రాజకీయ స్నేహం లేదని, ఇకపై జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై.. ప్రతి పదిరోజులకోసారి ప్రత్యక్ష ఉద్యమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆ మేరకు సమిష్టిగా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వైసీపీతో ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని, నేతలు బలంగా జనంలోకి తీసుకువెళ్లాలని ఆయన స్పష్టం చేశారు.   వైసీపీ సర్కారుతో పోరాడుతున్న రాయలసీమ నేతల రక్షణపై పార్టీ నాయకత్వం దృష్టి సారిస్తే బాగుంటుందని, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. ఆ సందర్భంగా ఆయన, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వ ర్గంపై జరుగుతున్న దాడులను ప్రస్తావించారు. అయితే అందుకు స్పందించిన రాష్ట్ర సహ ఇన్చార్జి సునీల్‌దియోథర్.. ఈ సమావేశంలో  వ్యక్తుల గురించి చర్చ వద్దని సూచించారు.

అంతకుముందు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఇన్చార్జి, కేంద్రమంత్రి మురళీధరన్.. ఏపీ నేతలు ఉద్యమాల విషయంలో,  తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని ఏపీ నేతలకు చురకలు అంటించారు. దుబ్బాక నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వరకూ,  బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ ఎలా పనిచేసిందో చూసి నేర్చుకోవాలన్నారు. మొక్కుబడి ఉద్యమాలు కాకుండా, నిర్మాణాత్మక ఉద్యమాలతో  బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.