మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కార్యవర్గాన్ని ఎన్నుకోవటానికి ఈ సెప్టెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పటికే సెకండ్ వేవ్ సీరియస్ గా ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్న వేళ.. అలాంటి పరిస్థితే ఉంటే.. ఎన్నికలు జరుగుతాయా? అన్నది సందేహమే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వెయ్యి మంది సభ్యులు ఉన్న ‘మా’కు జరిగే ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేయటానికి ఒకరు తర్వాత మరొకరు అన్నట్లుగా ఇప్పటికి నలుగురు బరిలోకి వస్తున్నట్లు ప్రకటించారు.
మరో మూడేు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధమని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యతో హడావుడి మొదలైంది. ఆయన ప్రకటన చేశారో లేదో.. ఆయనకు మద్దతు ఇవ్వటానికి నాగబాబు రెఢీ అయ్యారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గంటల వ్యవధిలోనే మంచు విష్ణు సీన్లోకి వచ్చేసి.. తాను పోటీకి రెఢీ అనటంతో ఇదో హాట్ టాపిక్ గా మారింది.
ఇక్కడితే ఈ హడావుడి ఆగితే సరిపోయేది. ఇంత జరుగుతున్నప్పుడు మా ప్రస్తావన లేకపోతే ఎలా? అన్నట్లుగా జీవితా రాజశేఖర్ తెర మీదకు వచ్చారు. తాను పోటీ చేస్తానని చెప్పారు. ఒకరుకాస్తా ముగ్గురు కావటంతో అసలేం జరుగుతుందో అర్థం కాక.. ఎవరు బరిలో ఉంటారు? మరెవరు రంగం నుంచి తప్పుకుంటారన్న ప్రశ్న వినిపిస్తున్న వేళ.. అనూహ్యంగా నటి హేమ కూడా రేసులోకి వచ్చేయటంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఫలానా వారికి మా మద్దతు ఉంటుందని ప్రకటనలు చేయటంతో మరింత ఉత్కంఠ పెంచుతోంది.
చూస్తుండగానే అధ్యక్ష స్థానానికి నలుగురు రెఢీ అవుతున్న వేళ.. వీరు సరిపోతారా? ఇంకెవరైనా రేసులోకి వచ్చే ఆలోచన ఉందా? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ‘మా’ అధ్యక్ష స్థానానికి పోటీ పడేందుకు విలక్షణ నటుడు సాయి కుమార్ రెఢీ అయినట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఆయన కూడా తన పేరును ప్రకటించే వీలుందని అంటున్నారు. మొత్తానికి ‘మా’ ఎన్నికలేమో కానీ.. దాని ముందు జరుగుతున్న పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.