ఏపీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ వరుసగా లేఖలు సంధిస్తున్న రఘురామ…ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు. అందుకే, తేలుకుట్టిన దొంగల్లా ఉన్న వైసీపీ నేతలు…ఈ లేఖలపై స్పందించకుండా దాటవేత ధోరణితో ఉన్నారు. అయినప్పటికీ, జగన్ కు తాజాగా రఘురామ పదో లేఖ రాశారు.
నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో అమరావతి రాజధాని నిర్మాణంపై జగన్ కు రఘురామ లేఖ రాశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో అమరావతిని ఏపీకి రాజధానిగా నిర్ణయించారని, అమరావతి రాజధానిగా కొనసాగితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రఘురామ అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పుడు మూడు రాజధానులు అవసరమా? అని జగన్ ను ఆర్ఆర్ఆర్ నిలదీశారు.
ఉన్న రాజధానిని గాలికొదిలేసి, మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల ఒరిగేదేమీలేదని రఘురామ తేల్చిచెప్పారు. 3 రాజధానుల వల్ల ప్రజలకు మరిన్ని ఇబ్బందులు ఎదురువతాయని రఘురామ వార్నింగ్ ఇచ్చారు. అమరావతి రాజధానికి నిస్వార్థంగా వేలాది ఎకరాల పంట భూములిచ్చిన రైతుల ఆవేదనను అర్ధం చేసుకోవాలని కోరారు. అమరావతి ఉద్యమం 550 రోజులు ముగించుకున్న సందర్భంగా రఘురామ ఈ లేఖ రాయడం విశేషం.