ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలే మిగిలి ఉందనన్న సంకేతాలు వైసీపీ నేతలు ఇస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై నానాటికీ వ్యతిరేకత పెరిగిపోతున్న తరుణంలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. పోనీ, లెక్క ప్రకారం చూసినా…ఏడాదిన్నరలో ఎన్నికలు జరగడం ఖాయం. అందుకే, అసలు తమ పార్టీ పరిస్థితి ఏమిటి? ఎన్ని సీట్లు రావొచ్చు? అన్న వ్యవహారాలపై వైసీపీ సహా అన్ని పార్టీలు సర్వేలు సీక్రెట్ గా నిర్వహించుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాతే ఎమ్మెల్యేలకు జగన్ క్లాసుల మీద క్లాసులు పీకి…పనిచేస్తేనే టికెట్లు అని కరాఖండిగా చెప్పేశారు. ఇక, ఆ సర్వేకు తోడుగా ఇటీవల జగన్ దగ్గరకు మరో 4 సర్వేల నివేదికలు చేరాయని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్, ఐప్యాక్ సర్వేలతోపాటు పార్టీలో ఉన్న ఇద్దరు కీలక నేతలు చేపట్టిన సర్వే నివేదికలు చూసి జగన్ షాకయ్యారట.
వైసీపీ గెలుపు అంత వీజీ కాదని జగన్ కు నాలుగు సర్వేలు తేల్చి చెప్పాయట. వైసీపీకి 61 సీట్లు, టీడీపీకి 42 సీట్లు, జనసేనకు 3 సీట్లు దక్కే అవకాశాలున్నాయని ఆ సర్వేలో తేలిందట. 44 సీట్లలో టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు తప్పదట. ఈ రెండు పార్టీల మధ్య గెలుపోటములని నిర్ణయించగలిగే సీట్ల సంఖ్య 25 అని ఆ సర్వేలో వెల్లడైందట. టీడీపీ-జనసేన పొత్తుకుదిరి పోటీ చేస్తే ఆ 25 సీట్లు ఆ కూటమికే దక్కే ఛాన్స్ ఉందట.
అదే జరిగితే, టీడీపీకి 42, జనసేనకు 3..మొత్తం 45..ఆ 25 కలుపుకుంటే 70…హోరాహోరీ పోరు జరిగే 44 స్థానాల్లో కనీసం 20 సీట్లు టీడీపీ గెలుచుకుంటే 90 సీట్లతో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని బట్టి వైసీపీని ఓడించాలంటే టీడీపీ-జనసేన పొత్తుపెట్టుకోవడంతోపాటు ఆ 20 సీట్లు గెలిస్తే వైసీపీ ఓటమి దాదాపు ఖాయం.