వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఆందోళన పడుతున్న కరోనా వైరస్ థర్డ్ వేవ్ మొదలైపోయిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్ర, కేరళలో నమోదైన కేసుల సంఖ్యను గమనిస్తుంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. పై రెండు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న కేసుల సంఖ్యతో ప్రభుత్వాల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
అందుబాటులోని సమాచారం ప్రకారమైతే కేరళలో గడచిన పదిరోజుల్లో సుమారు 1.5 లక్షల కరోనా వైరస్ కేసులు వెలుగుచూశాయి. అలాగే మహరాష్ట్రలో 95 వేల కేసులు నమోదయ్యాయి. జూన్ చివరి నెలలో కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి జూలై 1వ తేదీనుండి మళ్ళీ పెరిగిపోతుండటం రాష్ట్రప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఏమిటంటే లాక్ డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తేయటమే.
మన దగ్గర లాక్ డౌన్ ఎత్తేయగానే జనాలు పోలోమంటు రోడ్లపైకి వచ్చేస్తున్నారు. మనదేశంలో భౌతిక దూరం పాటించటం సాధ్యంకాదు. జనాల్లో చాలామంది కనీసం మూతికి మాస్కు కూడా పెట్టుకోకుండానే రోడ్లపైకి వచ్చేస్తున్నారు. దీనికితోడు శానిటైజర్లు వాడకుండానే అందరినీ ముట్టేసుకోవటం, హ్యాండ్ షేక్ చేయటం చేస్తుండటంతో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది.
కనీస జాగ్రత్తలు తీసుకునే విషయంలో ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసినా జనాల్లో చాలామంది పట్టించుకోవటంలేదు. అవసరం లేకపోయినా రోడ్లపైకి వచ్చేస్తున్న జనాలే ఎక్కువమందంటున్నారు. దీనికితోడు అందరికీ కోవిడ్ టీకాలు అందలేదన్నది కూడా వాస్తవమే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొదటినుండి కూడా కరోనా సమస్యకు మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే మహారాష్ట్రనే బాగా మూల్యం చెల్లించుకుంటోంది. మరి థర్డ్ వేవ్ తీవ్రత ఎలాగుంటుందో చూడాల్సిందే.