జనసేన ప్రధాన కార్యదర్శి, పీఏసీ సభ్యులు, మెగా బ్రదర్ నాగబాబు త్వరలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? జనసైనికుల ఆశ నెరవేరబోతుందా? నాగబాబు మంత్రి పదవికి లైన్ క్లియర్ అయిందా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి స్థానం నుంచి ఎంపీగా నాగబాబు పోటీ చేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటును నాగబాబు బీజేపీ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నడుమ నాగబాబును కేబినెట్లోకి తీసుకోబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించేశారు.
అయితే ఇందుకు ఇప్పుడు రంగం సిద్ధం అయింది. ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాత మంత్రిగా మెగా బ్రదర్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఐదు స్థానాలు కూటమికే దక్కనున్నాయని బలంగా టాక్ నడుస్తోంది. దీంతో ఆయా ఎమ్మెల్సీ స్థానాలు ఎవరినీ వరిస్తాయా? అన్న చర్చ జరుగుతోంది.
అయితే ఐదు స్థానాల్లో జనసేన నుంచి నాగబాబుకు కన్ఫామ్ అయినట్లు సమాచారం అందుతోంది. అలాగే బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారని ప్రచారం జరుగుతుండగా.. మిగిలిన మూడు సీట్లు టీడీపీకి దక్కనున్నాయి. ఈ మూడు స్థానాల కోసం టీడీపీ నుంచి బుద్ధా వెంకన్న, బీద రవీంద్ర, మోపిదేవి వెంకటరమణ, వంగవీటి రాధా, మంతెన సత్యనారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి వారు పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి ఛాన్స్ దక్కుందో చూడాల్సి ఉంది.
ఇకపోతే మార్చిలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు శాసనమండలికి ఎన్నికై చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కించుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో పవన్ కూడా శాసన మండలికి ఎన్నికై ఆ తర్వాత తన సోదరుడు కేబినెట్లోకి వస్తారని తెలిపారు. ఇప్పుడు ఆయన చెప్పినట్లే జరగబోతోంది. అనకాపల్లి లోక్సభ స్థానం త్యాగం చేసిన నాగబాబుకు తగిన ప్రతిఫలం దక్కబోతోంది.