ప్రస్తుతం దేశవ్యాప్తంగా ది కేరళ స్టోరీ చిత్రంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వివాదాస్పద సినిమాగా పేర్కొంటూ కేరళ ప్రభుత్వం ఆ చిత్రాన్ని నిషేధించాలని హైకోర్టును ఆశ్రయించింది. అదే బాటలో తాజాగా ఈ సినిమాను పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ సర్కార్ బ్యాన్ చేసింది. తమిళనాడులో కూడా ఈ సినిమా నిషేధం దిశగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఆ చిత్ర నిర్మాత సుప్రీంకోర్టు తలుపు తట్టారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని, తమిళనాడులో తమ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్రంపై నిషేధం విధించిన తొలి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. శాంతిభద్రతల దృష్ట్యా ఈ సినిమాను బ్యాన్ చేశామని, హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెబుతోంది.
తమ ఆదేశాలను ఉల్లంఘించిన థియేటర్లపై చర్యలు కూడా తీసుకుంటామని దీదీ వార్నింగ్ ఇచ్చింది. ఇక, తమిళనాడులోని మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా ప్రదర్శనను నిలిపేస్తున్నట్టుగా తమిళనాడు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లేకపోవడం, మల్టీప్లెక్స్ లపై దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ సినిమాపై నిషేధం విధించాలంటూ కేరళ ప్రభుత్వం కేరళ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ప్రభుత్వానికి చుక్కెదురైంది. సినిమాను బ్యాన్ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.