సోషల్ మీడియాలో ఊరూ పేరు లేకుండా ‘అనానమస్’ ముసుగేసుకుని ఏది పడితే అది వాగేయొచ్చని.. ఎవర్ని పడితే వాళ్లను ఎంత మాటంటే అంత మాట అనేయొచ్చని భ్రమల్లో ఉండే వాళ్లందరికీ ఇది పెద్ద గుణపాఠమే. ఆవేశంలో ఒక కామెంట్ పెడితే అది ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో చెప్పడానికి ఈ ఉదంతమే రుజువు.
టీ20 ప్రపంచకప్లో భారత జట్టు సెమీస్ కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో టీమ్ ఇండియా ఆటగాళ్ల మీద తమ ఆగ్రహాన్నంతా వెళ్లగక్కారు అభిమానులు.
పాక్ చేతిలో ఓడిపోవడమే కాక.. సెమీస్ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తే బాధ ఉంటుంది కాబట్టి తమ ఆగ్రహం చూపించడంలో తప్పు లేదు. కానీ కొందరు మాత్రం శ్రుతి మించిపోయి సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెట్టారు.
ఒక నెటిజన్ మరీ దారుణంగా ఈ వైఫల్యానికి బదులుగా 9 నెలల వయసున్న విరాట్ కోహ్లి కూతురిని రేప్ చేస్తానంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఐతే సరిగా చదువు వంటబట్టని జులాయి కుర్రాడెవరైనా ఈ కామెంట్ చేసి ఉంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ ఆ కామెంట్ చేసింది ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ అని, అతను హైదరాబాదీ అని తెలిసేసరికే అందరికీ దిమ్మదిరిగింది.
23 ఏళ్ల ఆ కుర్రాడి రామ్ నగేష్ ఆకుబత్తిని అని వెల్లడైంది. ఈ కుర్రాడి మీద కేసు పెట్టి పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఐతే రామ్ నగేష్ నేపథ్యం తెలిసి అందరూ అతణ్ని ఛీత్కరించుకుంటుండటంతో అతడి కుటుంబం తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలో రామ్ నగేష్ తండ్రి శ్రీనివాస్ మీడియాకు వివరణ ఇచ్చారు. తన కొడుకు చేసింది తప్పే అని.. ఐతే అతడికి దృష్టి లోపం ఉందని, అందువల్లే ఈ తప్పు జరిగిందని ఆయనన్నారు. తన కొడుకు జరిగిందానికి పశ్చాత్తాపం చెందుతున్నాడని, క్షమాపణ చెప్పాలనుకుంటున్నాడని కూడా వెల్లడించాడు.
ఐతే దృష్టిలోపానికి ఈ కామెంట్ పెట్టడానికి సంబంధం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అతడిది దృష్టిలోపం కాదని.. సంస్కార లోపం అంటూ మండిపడుతున్నారు. ఇంటర్నెట్లో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసేవారు ఈ ఉదంతాన్ని చూసి అయినా బుద్ధి తెచ్చుకోవాలని హెచ్చరిస్తున్నారు.