టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఏపీ ప్రభుత్వంపై సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నప్పుడు.. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరు పారించామని.. కానీ, ఇప్పుడు రహదారులపై వైసీపీ ప్రభుత్వం రక్తం పారిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. తనను కూడా కొట్టించి.. రక్తం వస్తే.. చూసి ఆనందించాలని ఓ ముఖ్య నాయకుడు తహతహ లాడిపోతున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
గడిచిన నాలుగు సంవత్సరాల్లో వైసీపీ పాలన అన్ని విధాలా రాష్ట్రాన్ని నాశనం చేసిందని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు ఓర్చుకున్న ప్రజలు.. ఇప్పుడు సహనం నశించి.. తిరగబడే స్థాయికి వచ్చారని అన్నారు. సీమలో నీరు పారించాలని తాము చూస్తుంటే.. రక్తం పారించాలని వైసీపీ పాలకులు చూస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో 4,300 చెరువులు, వాటికింద సుమారు 47వేల ఎకరాల సాగు భూమికి అవకాశం ఉంటే.. జగన్ ప్రభుత్వం చెరువుల అభివృద్ధిని విస్మరించిందని చెప్పారు.
సాగునీటి ప్రాజెక్టు విధ్వంసంపై పోరుబాట చేస్తున్న చంద్రబాబు.. ఈ క్రమంలో తిరుపతి జిల్లా రేణిగుంటలో పర్యటించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 1,147 ఎకరాల్లో చెరువులు ఆక్రమణ జరిగిందని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక చిత్తూరులో 25 ప్రాజెక్టులు ప్రీక్లోజర్ చేశారని మండిపడ్డారు.
“రాష్ట్ర మంత్రి వర్గంలో అతి పెద్ద దొంగ ఎవరైనా ఉంటే.. ఆయన పెద్దిరెడ్డే. ఈ నాలుగేళ్లలో శ్రీబాలాజీ రిజర్వాయర్, వేణుగోపాలసాగర్ రిజర్వాయర్‌లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు“ అని దుయ్యబట్టారు. జీవోలతో సహా చూపిస్తే నాపై దాడికి పాల్పడుతున్నారని, ప్రశ్నిస్తే నా రక్తం కళ్ల చూడాలనుకుంటారా? అని చంద్రబాబు మండిపడ్డారు. నా రక్తం చూసేందుకు ఒక నేత తహతహ లాడిపోతున్నాడని చెప్పారు.